Tuesday, November 26, 2024
Homeటాప్ స్టోరీస్పర్రెలు మేడిగడ్డలోనే కాదు..అన్నారం.. సుందిళ్లలోనూ..

పర్రెలు మేడిగడ్డలోనే కాదు..అన్నారం.. సుందిళ్లలోనూ..

పర్రెలు మేడిగడ్డలోనే కాదు..అన్నారం.. సుందిళ్లలోనూ..

కాళేశ్వరంపై నమ్మలేని నిజాలు వెల్లడించిన కాగ్..

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాళేశ్వరంపై ఆడిట్ నివేదిక ఇచ్చిన కాగ్ అందులో ప్రాజెక్ట్ లని ఇతర బ్యారేజీల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ క్రమంలోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల దిగువ భాగంలో కొంత మేర 2019 నవంబర్‌లోనే దెబ్బతిన్నట్లు తెలిపింది. 2019 నవంబర్‌లో వరద భారీగా రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని వెల్లడించింది. గేట్లు మూసిన తర్వాత ఆనకట్టల దిగువ భాగంలో ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడల్లో కొంత భాగం, దిగువ భాగంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని పేర్కొంది. ఫలితంగా 180.39 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వివరించింది.

కోట్లలో నష్టం.. 

మేడిగడ్డ వద్ద రూ.83.83 కోట్లు, అన్నారం వద్ద రూ.65.32 కోట్లు, సుందిళ్ల వద్ద రూ.31.24 కోట్ల మేర నష్టం జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. విడుదలైన నీటి అధిక వేగం, శక్తిని వెదజల్లే పనులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని నీటిపారుదలశాఖ అధ్యాయనాలు వెల్లడించినట్లు తెలిపింది. ఈ అనుభవంతో మూడు బ్యారేజీల్లో నష్టాలను సరిదిద్దేందుకు రూ.476.03 కోట్లతో నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించిందని వెల్లడించింది. ఇందులో మేడిగడ్డకు రూ.212.03 కోట్లు అన్నారం బ్యారేజీకి రూ.139.50 కోట్లు, సుందిళ్లకు 124.50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు పేర్కొంది.

పెరిగిన అంచనా వ్యయం..

మేడిగడ్డలో సీపీ దిమ్మెల అప్రాన్‌ లాంచింగ్‌ల రూపకల్పన లోపభూయిష్టంగా ఉండడం వల్లే పిల్లర్స్ దెబ్బతిన్నాయని కాగ్ తెలిపింది. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ ఆనకట్ట పిల్లర్లు కుంగడానికి గల కారణాలపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ ఇచ్చిన నివేదికలోనూ ఈ అంశాలు ఉన్నాయని చెప్పిన కాగ్, నివేదికలో కమిటీ అభిప్రాయాలను పొందుపరిచింది. ఆమోదించిన డ్రాయింగ్‌ల ప్రకారం, నీటి పారుదల శాఖ పర్యవేక్షణ, నాణ్యత ధ్రువీకరణలో కచ్చితంగా పనులు జరిగాయని మేడిగడ్డ బ్యారేజీ కాంట్రాక్టర్ తెలిపినట్లు రికార్డులు చెబుతున్నాయని కాగ్ పేర్కొంది. స్థానభ్రంశం చెందిన అప్రాన్‌లను పునరుద్ధరించేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్లు ప్రభుత్వం ఎటువంటి పత్రాలు ఇవ్వలేదన్న కాగ్, మేడిగడ్డ ఆనకట్ట అంచనా వ్యయం రూ.1849 కోట్ల నుంచి రూ.4321 కోట్లకు 134 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. అన్నారం ఆనకట్ట అంచనా విలువ రూ.1452 కోట్ల నుంచి రూ.2565 కోట్లకు 77 శాతం మేర పెరిగినట్లు చెప్పింది. సుందిళ్ల ఆనకట్ట అంచనా వ్యయం రూ.1248 కోట్ల నుంచి రూ.2148 కోట్లకు 72 శాతం మేర పెరిగినట్లు వివరించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments