Monday, November 25, 2024
Homeతెలంగాణఓటమికి కారణం అవినీతి, అహంకారమే

ఓటమికి కారణం అవినీతి, అహంకారమే

రాజకీయాలను భ్రష్టుపట్టించిందే బీఆర్ఎస్
వలసల గురించి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాండ్లు..
యువతను రెచ్చగొడుతున్న బీజేపీ, బీఆర్ఎస్..
సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కడియం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ పదేళ్లలో రాష్ట్రంలో ఏం చేసిందో చెప్పాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. గురువారం ఘనపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా సహకరించ లేదని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని, త్వరలోనే రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలవుతాయని పేర్కొన్నారు. యువతను రెచ్చగొడుతున్న బీజేపీ 10 ఏండ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్కరికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర బీజేపీ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. రాముడి పేరు చెప్పి రాజకీయం చేసే బీజేపీ నిరుద్యోగులకు ఏం చేసిందో చెప్పాలని మండిపడ్డారు.
రాజకీయాలను భ్రష్టుపట్టించిందే బీఆర్ఎస్..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీఆర్ఎస్ 10ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలన్నారు. కుటుంబానికే పరిమితమైన అధికారం, అవినీతి, అహంకారం వల్లనే బీఆర్ ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత వారికి లేదని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ అని విమర్శించారు. మళ్లీ ఏం ముఖం పెట్టుకొని వలసల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. రాజకీయ వలసల గురించి స్పీకర్, కోర్టులు వారి అభిప్రాయాలు తెలియజేస్తాయన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు. శాఖలను పంచుకొని మరీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ ఆస్తులు 2014 ముందు ఎంత ఉన్నాయో.. 2024 లో ఎంత ఉన్నాయో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ ఎస్ నాయకత్వం పైన నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ కనుమరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments