16,940 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం
రెండు రోజుల్లో అనుమతి
స్పాట్ వాయిస్ ,ఎడ్యుకేషన్: రాష్టంలో మరో 16,940 పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో అనుమతులు ఇచ్చి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్, వైద్య, పోలీసు, గురుకుల విద్యాలయాల నియామక మండలి, జిల్లా ఎంపిక కమిటీ తదితర సంస్థల ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. ప్రక్రియలో తప్పక సమయపాలన పాటిస్తూ, నిర్ణీత కాలపరిమితితో వీటిని చేపడతామన్నారు. ఉద్యోగ నియామకాలపై మంగళవారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతికుమారి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, జీఏడీ, వ్యవసాయ, వైద్యఆరోగ్య, దళిత అభివృద్ధి శాఖల కార్యదర్శులు శేషాద్రి, రఘునందన్‌రావు, రిజ్వి, రాహుల్ బొజ్జా, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో పలు కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. ఇంకా 16,940 పోస్టులకు ఆర్థికశాఖతో పాటు ఇతర శాఖల నుంచి అనుమతులిస్తామన్నారు. ఈ పోస్టులకు సంబంధించి సర్వీసు నిబంధనల్లో మార్పులు, ఇతర అంశాలపై వివరాలను సంబంధిత శాఖలు సర్వీస్ కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు.
Recent Comments