ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్..
రాజీనామా యోచనలో జీవన్ రెడ్డి..
మంతనాలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు..
బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నాలు..!
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీ పార్టీ లేకుండా చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాజాగా హస్తం గూటికి చేరిపోయారు. అయితే రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ఈ పనిపై ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపైన మీడియా ముఖంగానే జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి సరిపోయినంత మెజార్టీ ఉందని.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన జీవన్ రెడ్డి.. ఇలాంటి పనులను తాను ప్రోత్సహించనని చెప్పుకొచ్చారు. పోచారం చేరిక పూర్తిగా అవకాశవాదానికి నిదర్శనంగా అభివర్ణించారు. జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే.. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే వరుసగా జరిగిన ఈ ఘటనలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు తెచ్చిపెట్టాయి.
తీవ్ర అసంతృప్తి..
జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే సంజయ్, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను హస్తం గూటికి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనను రెండుసార్లు ఓడించిన తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదని కూడా తెలుస్తోంది. దీంతో.. తీవ్ర ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే.. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ వెనువెంటనే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయణ్ను బుజ్జిగించే పనిలో పడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం.
వ్యవసాయం చేసుకుంటా..
40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
బీజేపీలోకా..?
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆ పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఆయన రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జోరందుకోవడంతో.. బీజేపీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, మచ్చ లేని రాజకీయ నాయకుడు కావడంతో.. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ రంగంలోకి దిగినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Recent Comments