పదవులు తొలగిస్తే ఝలక్ కాదు.. రేవంత్ కు అసలైన షాక్ ఇస్తా..
విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్‌లోనే తప్పొప్పులు మాట్లాడేకునే వీలుంటుందని, పదవులు కోత అనేది స్పోర్టివ్‌గా తీసుకుంటానని చెప్పారు. రాజకీయంగా సీఎం కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. దేశానికి కాంగ్రెస్‌తోనే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అయితే తన పంచాయితీ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, మెదక్ పర్యటనకు రేవంత్ తనను పిలవలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడతానన్నారు. తనతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎవరూ మాట్లాడట్లేదన్నారు. తనతో మాట్లాడేందుకు నేతలు భయపడుతున్నారని అన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా అన్నందుకు నొచ్చుకుని ఉంటారని.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని జగ్గారెడ్డి అన్నారు.
పార్టీకి సంబంధం లేదు
పార్టీ పదవుల నుంచి తొలగించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు ఝలక్ ఇవ్వటం కాదని…. తానే ఆయనకు అసలైన షాక్ ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్‌రెడ్డికి మధ్య మాత్రమేనని… కాంగ్రెస్‌కు సంబంధంలేదని ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో కలిసి సాగుదామని రేవంత్‌రెడ్డి ఏనాడూ తనకు చెప్పకపోగా.. అనుచరులతో తనపై టీఆర్ఎస్ ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ముత్యాల ముగ్గులో కథానాయిక మాదిరి కాంగ్రెస్‌లో తన పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నట్లు తన ఫొటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు.
Recent Comments