డబ్బులు ఇస్తేనే..తలకొరివి
కాసుల కోసం కొడుకు దారుణం..
అందరు ఉన్నా.. అనాథగా అమ్మ మృతదేహo
స్పాట్ వాయిస్, బ్యూరో : కాసుల కోసం కన్నపేగు అన్న కనికరం కూడా చూపలేదు పిల్లలు. ఆస్తి పంపకాలు తేలేవరకు దహన సంస్కారాలు చేయమని నిరాకరించారు. బిడ్డలున్నా అనాథగా తల్లి మృతదేహాన్ని వదిలేయడం హృదయాల్ని కలచివేసింది. ఈ అమానుష ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నేరేడుచర్ల మండలం కందులవారిగూడేనికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయాడు. భర్త వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఐదేళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటుంది. ఇటీవల ఆమె ఇంట్లో కాలుజారి కిందపడింది. దీంతో లక్ష్మమ్మను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని, ఆక్సిజన్‌పైనే బతుకుతుందని చెప్పారు. దీంతో బుధవారం అంబులెన్స్‌లో లక్ష్మమ్మను ఆక్సిజన్‌తోనే చిన్న కూతురు ఇంటికి తీసుకెళ్లింది. ఈలోగా ఆమె కుమారుడు అక్కడికి చేరుకుని, పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించాడు. తల్లిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. దీనికి మిగతా కూమార్తెలు ఆస్తి పంపకాలు తేలేవరకూ అమ్మను తీసుకెళ్లనీయమని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే రాత్రి 11:00 గంటల సమయంలో లక్ష్మమ్మ చనిపోయిoది. దీనితో కుమారుడు లక్ష్మమ్మ మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించారు. అయినా వారి మధ్య పంచాయితీ మాత్రం తీరలేదు. లక్ష్మమ్మ దగ్గర రూ.21 లక్షలు, ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. తల్లి వైద్య ఖర్చులు భరించిన చిన్న కుమార్తెకు అందులోంచి రూ.6 లక్షలు ఇచ్చారు. మిగతా రూ.15 లక్షలు కుమారుడు తీసుకున్నాడు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కుమార్తెలు పంచుకున్నారు.
డబ్బులు ఇస్తేనే..తలకొరివి
చివరి నిమిషాల్లో కుమారుడు మరో కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం ఫ్రీజర్‌లో ఉంది. ఈ గొడవ ఎప్పుడు తీరుతుందోనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recent Comments