టోర్నడో.. 120 కిలో మీటర్ల వేగం..
ములుగు అడవుల్లో భారీ బీభత్సం..
ఒకే వైపు కుప్పకూలిన వృక్షాలు..
సారవంతమైన నేలే అయినా.. పడిపోయాయ్
వేర్లు లోతుకు ఎందుకు వెళ్లలేదు..
అటవీశాఖకు అంతుచిక్కని ప్రశ్న..
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి, పస్త్రా అటవీ పరిధిలో క్లౌడ్ బరస్ట్ తో పాటు అతివేగంగా గాలులు వీయడం వల్లే లక్షకుపైగా చెట్లు నేలకూలాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీ ఎఫ్) డోబ్రియల్ తన నివేదకలో వెల్లడించారు. సుమారు 204.30 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భారీగా వృక్షాలు కూలిపోయాయని పేర్కొన్నారు. గత ఆగస్టు 31న తాడ్వాయి పస్రా అడవుల్లో భారీ బీభత్సమే జరిగిందని తెలిపారు.
మేఘాలు కిందికొచ్చాయి..
ములుగు అడవుల్లో క్లౌడ్ బరస్ట్ కు దారి తీసే వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని, మేఘాలు కిందికి ఎందుకు వచ్చాయన్న విషయం అంతుచిక్కడం లేదని, దీనిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, లేదా వాతావరణ శాఖతో అధ్యయనం చేయించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
120 కిలో మీటర్ల వేగంతో..
‘టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో వెళ్తాయని, కుప్పకూలిన చెట్లు కూడా ఒకవైపే పడి ఉన్నాయి. భారీ వృక్షాలు కూడా నేలకొరగడాన్ని బట్టి.. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చు’’ అని వివరించారు. అయితే 50 వేల చెట్లకు పైగా ఒకేసారి నేలకొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డీఎఫ్ వో రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ(ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్ సీ)తో కలిసి పరిశీలన జరుపుతోంది.
సారవంతమైన నేలే అయినా..?
చెట్లు కూలిపోయిన ప్రాంతమంతా రాళ్లు, రప్పల్లేని సారవంతమైన నేలే అని డోబ్రియల్ పేర్కొన్నారు. అయితే చెట్ల వేర్లు తక్కువ లోతుకే పాయాయని, దీనికి కారణం ఏంటో అర్థం కావడం లేదని తెలిపారు. వేర్లు లోపికి వెళ్లకపోవడం వల్లే చెట్లు కూలిపోయాయని పేర్కొన్నారు. అలాగే ధ్వంసమైన ప్రాంతాన్ని సంరక్షిస్తే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించవచ్చని, అటవీ ప్రాంతం చుట్టు కంచె వేయాలని నివేదికలో సూచించారు.
Recent Comments