Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్కమలంలో కయ్యం.. 

కమలంలో కయ్యం.. 

కమలంలో కయ్యం.. 

కిషన్ రెడ్డిపై తిరుగుబాటు..

ఎమ్మెల్యేలు, ఎంపీల వేరు కుంపటి..

పావులు కదుపుతున్న కీలక నేతలు.. 

కొత్త అధ్యక్షుడి కోసం లాబీయింగ్

మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు.. 

స్పాట్ వాయిస్, బ్యూరో: కేంద్రమంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై పార్టీలోనే తిరుగుబాటు చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకే అధ్యక్షుడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా దాన్ని బేఖాతరు చేయడం పరిపాటిగా మార్చుకుంటున్నారు. ఏ కార్యాన్ని అప్పగించినా లైట్ తీసుకుని దూరంగా ఉంటున్నట్టు సమాచారం. బీజేపీలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కిషన్ రెడ్డి ని ఎవరు లెక్క చేయడం లేదనేది వాస్తవం. ఇప్పటికే బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డిని కాదని సొంత జెండాతో పార్టీ ముసుగులో పరోక్ష ఎదురుదాడికి దిగుతున్నారు. కిషన్ రెడ్డి ఒకటి అంటే ఏలేటి మరో అంశంతో ముందుకు సాగుతున్నారు.

ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఈటల రాజేందర్ తనదారి తాను చూసుకుంటూ కిషన్ రెడ్డిని బైపాస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీ ఉన్న ఈటల ఇప్పుడు కీలకంగా పార్టీని ముందకు నడిపే బాధ్యతలపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా ల వద్ద తనకున్న గుర్తింపును పదవి పొందడానికి వాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైనట్టుగా భావిస్తూ ఆ దిశగా పావులుకదుపుతున్నట్టు సమాచారం.

అలాగే ఎంతటి క్లిష్ట సమస్యనైనా తన వాగ్దాటితో చీల్చిచెండాడే ఎంపీ రఘునందన్ రావు సైతం కిషన్ రెడ్డిని విభేదిస్తున్నట్టు సమాచారం. ఒంటెత్తు పోకడలు, సరైన గుర్తింపు ఇవ్వని నైజం, ఇతరులను కలుపుకుని పోయే క్రమంలో కొన్ని వ్యవహారాలను అంటీముట్టన్నట్టుగా భావించడం వంటివాటిలో నొచ్చుకున్న రఘునందన్ వేరు కుంపటి కి ఊతమిచ్చే పనులకు సాయంగా ఉంటున్నట్టు పార్టీలోని ఓ వర్గం పేర్కొంటోంది.

ఇక ఇవన్నీ ఒకెత్తైతే ఏలేటి మహేశ్వర రెడ్డి తన డేరింగ్ అండ్ డాషింగ్ తెగింపుతో కిషన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది. సుంకిశాల ఘటనపై ఎవ్వరూ నోరు మెదపక పోయినా పనిగట్టుకుని, ప్రతి సందర్భంలో ఏలేటి ఒంటి కాలుపై లేస్తున్నారు. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని, మేఘాను బాధ్యురాలిగా చేసి ప్రజాధనం వృథాను కక్కించాలని భీష్మించుకుని సవాళ్లు విసురుతూనే ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విషయమై మౌనంగా ఉంటున్న ఆయన మాత్రం తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. మరో కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సైతం మార్పు దిశగా పావులు కదిపే యత్నంలో ఉన్నవారికి తనవంతుగా సహకరిస్తూ గుట్టుచప్పుడుకాకుండా వ్యవహరించాల్సినది సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా కమలంలో మూడు వర్గాలు.., ఆరు గ్రూపులుగా రాజకీయం రక్తికట్టిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా సమస్యలే నెపంగా తిట్టిపోసుకుంటుంటే., బీజేపీ మాత్రం తమ తమ వర్గాల బలాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments