Saturday, September 21, 2024
Homeతెలంగాణఫైటర్.. కోసం ఫైట్..

ఫైటర్.. కోసం ఫైట్..

బీజేపీలో డిష్యూం..డిష్యూం
అధ్యక్ష పదవి తెచ్చి లొల్లి
మాటకు మాట పేల్చుతున్న కాషాయం నేతలు
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో జోరు మీదున్న బీజేపీలో వార్ నడుస్తోంది. ప్రస్తుతం పదవుల కోసం మాటలు తూటల్లా పేలుస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోగా.. ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ అప్పగించగా.. బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం.. ఒక నేతకు ఒకటే పదవి. దీని ప్రకారం.. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను మరొకరికి అప్పగించే పనిపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఈ పదవి కోసం.. చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. అధిష్ఠానం సైతం ఆయన వైపే మొగ్గు చూపుతుండగా.. కొంతమంది ఆ పార్టీ నేతలకు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఇష్టంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.
ఫైటర్ కావాలి..
తెలంగాణలో బీజేపీని నడిపించేందుకు నాయకుడు మాత్రమే కాదు.. ఫైటర్ కావాలంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేవాళ్లు కావాలని.. అందరినీ కలుపుకునిపోయే లీడర్ కావాలంటూ అధిష్ఠానానికి సూచించారు. ఈ కామెంట్లు.. ఈటలను ఉద్దేశించే అన్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడిచింది. దీనిపై స్వయంగా ఈటల రాజేందరే స్పందిస్తూ.. సంచలన ప్రకటన చేశారు.
స్ట్రీట్‌ ఫైటరా.. రియల్‌ ఫైటరా..
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలని ఒకాయట అంటున్నారని.., గల్లీలో కొట్లాడే ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని.. వీధుల్లో కొట్లాడే ఫైటర్ కాదని.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలన్నాడు. తన లాంటి వాళ్లు ఊరికే మాట్లాడరని.. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మలతో కొట్లాడతామని ఈటల గుర్తు చేశారు. ఈ ప్రకటనతో.. రాజాసింగ్‌కు ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. ఇద్దరి పరస్పర కామెంట్స్ లో పార్టీలో అధ్యక్ష పదవి అంతర్గత వార్ కు తెరలేపినట్లు చర్చ నడుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments