భార్య వేధింపులు.. ఆమె ప్రియుడి బెదిరింపులు
పంచాయితీ పెట్టిన మారని భార్య తీరు..
చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య
స్పాట్ వాయిస్ , మహబూబాబాద్: వివాహేతర సంబంధం నెర్పుతున్న భార్య వేధింపులు, ఆమె ప్రియుడి బెదిరింపు లకు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్లలో శుక్రవారం రాత్రి జరిగింది. సీరోలు ఎస్సై నరేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లెల్ల గ్రామానికి చెందిన కొమిరె జంపయ్య(36) భార్య నాగేంద్రకు అదే గ్రామానికి చెందిన తోట నరేశ్‌తో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఎన్ని సార్లు చెప్పినా మారకపోగా తన ప్రియుడితో వార్నింగ్‌లకు దిగింది. పది మందిలో పంచాయితీ పెట్టినా పద్ధతి మారలేదు. ఇక తనను బతకనివ్వరన్న భయంతో జంపయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాలు ఇలా..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామానికి చెందిన కొమిరె జంపయ్య, నాగేంద్ర భార్యభర్తలు. జంపయ్య భార్య నాగేంద్ర నల్లెల్ల గ్రామానికే చెందిన తోట నరేశ్‌తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకి తెలియగా.. నరేశ్, జంపయ్య మధ్య గొడవలు జరిగాయి. నరేశ్ తన తీరు మార్చుకోకపోవడంతో.. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి జరిమానా కూడా ఇప్పించారు. అయితే, తమ విషయం పది మందిలో పెట్టి పరువు తీశాడన్న కారణంతో భార్య నాగేంద్ర తరచూ జంపయ్యతో గొడవ పడుతూ వస్తుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట భర్తతో గొడవ పడిన నాగేంద్ర రాజోలులోని పుట్టింటికి వెళ్లింది. దీంతో శుక్రవారం నరేశ్, జంపయ్యను తీసుకొని మహబూబ్‌బాద్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాటల సందర్భంలో నిన్ను, నీ పిల్లల్ని నీ భార్య చంపేస్తుందంటూ బెదిరించాడు. నిజంగానే తన భార్య తనను చంపేస్తుందని భయపడిన జంపయ్య.. వరంగల్‌లో ఉంటున్న సోదరుడు ఎల్లయ్యకు ఫోన్ చేసి తన భార్య చంపేస్తుందన్న విషయం చెప్పాడు. ఇక తనకు బతకడం ఇష్టం లేదని.. ఇలా బతకలేనంటూ ఫోన్ కట్ చేశాడు. ఎల్లయ్య వెంటనే ఆ ఊర్లో వాళ్లకి ఫోన్ చేసి చెప్పగా.. వారు జంపయ్య ఉండే ప్రదేశానికి వెళ్లి చూసే సరికే ఉరేసుకుని కనిపించాడు. జంపయ్య మృతికి నరేశ్ కారణమంటూ మృతదేహాన్ని అతని ఇంటి ముందు వేసి ఆందోళన చేపట్టారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాగేంద్ర, నరేశ్‌పై కేసు నమోదు చేశారు.
Recent Comments