త్వరలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు
టీఆర్ ఎస్ ది ఫ్రెండ్లీ మీడియా ప్రభుత్వం
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హన్మకొండ జిల్లా మహాసభ
హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ
స్పాట్ వాయిస్, సుబేదారి : గ్రేటర్ వరంగల్ జర్నలిస్టులు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల కోరికను త్వరలో టీఆర్ ఎస్ ప్రభుత్వం తీర్చబోతుందని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఆదివారం హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) హన్మకొండ జిల్లా మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా దాస్యం హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేనివిధంగా తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఫ్రెండ్లీ మీడియా సంబంధాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించామని, కొద్ది రోజుల్లో మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుందని వెల్లడించారు.
గౌరవ అతిథి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ దాదాపు 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, పోరాటాలు, త్యాగాల కలయికే టీయూడబ్ల్యూజే(ఐజేయూ) అని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పక్షపాతిగా, గొంతుగా నిలబడి అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో నిర్విరామంగా పోరాడుతున్న చరిత్ర తమ సంఘానిదేనన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలు ఐజేయూను, రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులు టీయూడబ్ల్యూజేను ఆదరిస్తున్నారని అన్నారు. దాదాపు13,800 సభ్యత్వాలతో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ, 33 జిల్లాల్లో కమిటీలతో, కార్మిక శాఖ నిబంధనలకు కట్టుబడి రాష్ట్రంలో జర్నలిస్టులకు సేవలందిస్తున్న ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే (ఐజేయూ)మాత్రమేనన్నారు. ప్రభుత్వ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు జర్నలిస్టు సంఘాల పేరుతో దుకాణాలు పెట్టినా అవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమేనని, జర్నలిస్టులు మాత్రం వారిని ట్రేడ్ యూనియన్ గా గుర్తించడం లేదని విరాహత్ ఆరోపించారు. కాగా, హన్మకొండ జిల్లా పరిధి హన్మకొండ, పరకాల నియోజకవర్గాలతో పాటు మరో మూడు మండలాల నుంచి దాదాపు 200 మంది జర్నలిస్టులు సభకు ఎంతో ఉత్సాహంగా హాజరవడం విశేషం. జిల్లా మహాసభకు యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణకర్, రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట రమణ, గడ్డం రాజిరెడ్డి, విద్యాసాగర్, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ కన్వీనర్ అయిలు రమేష్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కంకణాల సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచందర్ రావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments