Tuesday, November 26, 2024

హై టెన్షన్..

ఈడీ ముందుకు కవిత..
టీవీల ఎదుట బీఆర్ఎస్ నేతలు..
అరెస్ట్ అంటే ఆందోళనలు..!
తిరిగొస్తే క్షీరాభిషేకాలు, సంబురాలు..
దేనికైనా రెడీ అంటున్న నాయకులు

నిశితంగా పరిశీలిస్తున్న ప్రతిపక్షాలు

స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. ఇక రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు టీవీల ముందు అతుక్కుపోయారు. ఈడీ విచారణ వార్తలను ఉత్కంఠగా వీక్షిస్తున్నారు. అరెస్ట్ అంటే ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈడీ విచారణను విజయవంతంగా ఎదుర్కొని వస్తే క్షీరాభిషేకాలు, సంబురాలు చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా పబ్లిక్ ఉంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్స్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

హైదరాబాద్ లో పోస్టర్లు..
హైదరాబాద్‌లో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసాయి. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అంటూ సీబీఐ, ఈడీలను ఉపయోగించి చేస్తున్న బెదిరింపు రాజకీయాలను ఎత్తిచూపారు. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్‌కి ముందు.. తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారనే అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ పోస్టర్‌పై కొటేషన్ కూడా ఉంది. ఇదిలా ఉంటే అన్ని పార్టీల నేతలు సైతం కవిత లిక్కర్ ఎపిసోడ్, ఈడీ విచారణ ఘట్టాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments