నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో ఉద్రిక్తత
ప్రతిపక్ష, విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్
దీక్షకు అనుమతి లేదన్న వీసీ
ఓయూ గేట్లు మూసివేసిన సెక్యూరిటీ..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్ష నేపథ్యంలో విద్యార్థి సంఘాలుదీక్షకు ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు మల్లు రవి, అద్దంకి, చామల కిరణ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ముందస్తు అరెస్టులను విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక క్యాంపస్ లోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదని ఓయూ వీసీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్చి 24, 25వ తేదీల్లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ బాధ్యులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. న్యాయపరంగా తాము పోరాటం చేస్తుంటే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడమేంటంటని ప్రశ్నిస్తున్నారు. అటు క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించడంలేదు. అటు నిరుద్యోగ మార్చ్‌కు విద్యార్థి సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకున్నారు. దీక్షకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు క్యాంపస్ లో హై అలెర్ట్‌ను ప్రకటించారు.
Recent Comments