Monday, November 25, 2024
Homeజనరల్ న్యూస్దాగుడు మూతలు..

దాగుడు మూతలు..

దాగుడు మూతల ఆటలో కళ్లు మూసి పారిపో.. అని చెప్పే వాడికి ఎవరెవరు ఎటెళ్తున్నారో క్లియర్ గా తెలుసు. వెనుక నుంచి ఎలా అనుసరిస్తే ఎవరినెలా పట్టుకోవాలో కూడా తెలుసు. ఆ మాటకొస్తే తాము పారిపోతున్నామన్న మాటేగాని, అటు కళ్లు మూయబడిన వాడు, ఇటు కళ్లు మూసినట్టు చేతులడ్డం పెట్టినవాడు ఇద్దరూ ఏకమైతే ఎవరెటుపోయినా ఇట్టే కనిపెట్టే చిట్కాలు వారి వద్ద పుష్కలం. ఆటలో గెలుపు ముఖ్యమే కావచ్చుగానీ, నమ్మకంతో గెలవడం మరీ ముఖ్యం. కనుక్కోవాల్సిన వారు, కనిపెట్టడానికి వెళ్తున్న వాడు ఇలా ఇరువురికి నిర్ణేత అనే వాడు సమప్రాధాన్యం ఇవ్వాలి. అలాకాకుండా నిజంగానే ఇరు వర్గాలతో వాడే దాగుడు మూతలాడితే..? సందులు, చాటుమాటులు వెతుక్కుని వెళ్లే ప్రయత్నం చేసే వాడికి., మూసిన కళ్లు తెరిచి ఆచూకీ కనిపెట్టే వాడికి ఆటలో మజా ఉండదు.., ఫలితంలో పస చిక్కదు.

నమ్మిన వారు ప్రజలు. నిలబెట్టుకోవాల్సిన వారు నేతలు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అన్నింటికీ సుప్రీం ఓటరే. కానీ, ఆయన్ని అలా ఉండనిస్తున్నారా..? ఆయన స్థాయిని నిలబెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారా.? ప్రతి దానికి ఓ ప్రత్యేక ఐడెంటిటీ. గుర్తింపు ఎన్నికల వరకే ఇచ్చి, ఆ తర్వాత గడప కూడా చూడకుండా ముఖం చాటేసి తమ రాబడికే ప్రాధాన్యం ఇస్తున్నదెవరు. ఎన్నికలంటేనే ఓ పెట్టుబడిగా భావించి, ఫలితాల తర్వాత రాబడి లెక్కలు చూసుకుంటూ ఓట్లేసిన వారికి కావాల్సిన వాటిని సమకూర్చడం కంటే, తమకు ఇంకెంత రావాలనే ధోరణిలో చెలరేగిపోతున్నారు. ‘‘అది అందుగలరు.., ఇందులేరు అనే సందేహం లేకుండా ఎందెందు వెతికినా అంత కాకపోయినా కొందరు వారే..’’ అన్నట్టుగా పుట్టుకొస్తుంటే, వేసిన ఓటుకు విలువేది..? గెలిపించుకున్న ఓటరుకు స్థానం ఏముంటది.

ఐదేళ్లకోసారి ఆడే ఆటకు మిగతా నాలుగేళ్లు రిహార్సల్ చేస్తూ బిజీ క్రీడా షెడ్యూల్ ప్రకటనలు వెల్లువలా రావడం పరిపాటి అయ్యింది. అభివృద్ధి తాంబూలాలు అందేది దేవుడెరుగునో.., లేదంటే నేతలెరుగునోగానీ.., ఆటలో మాత్రం వీరిని వారు విపరీతంగా వాడేసుకుంటున్నారు. ఎవరు ఎవరితో ఆడుతున్నట్టు., ఎవరు ఎవరిని ఆడిస్తున్నట్టు.? ఆడడానికి చిక్కిందెవరు.., ఆటలో లక్కున్నదెవరికి..? ఆడేసుకోవడానికి వాళ్లు.., ఆడుకోవడానికి వీళ్లా..? ఎవరి ఆట వారు ఆడితేనే గేమ్ అందంగా ఉంటుంది. అందరాట కొందరే ఆడుతానంటేనే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మైదానంలో దిగాక క్రీడాకారుడు, న్యాయనిర్ణేత అనే తేడాలు స్పష్టంగా కనిపించాలిగానీ, ఎవరొక్కరు డమ్మీ అయినా ఎందుకు ఆ ఆట.., ఎవరు గెలిస్తే ఎందుకంట..?

అన్నీ సమకూర్చుకోవడం అందరికీ అసాధ్యం. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఫలాలు ఇంకా సమపాళ్లల్లో అందలేదంటేనే దౌర్భాగ్యం. అందరికీ న్యాయం జరిగేలా., జీవన స్థాయిని బట్టి ఫలాలు దక్కేలా చేసే పూచీకత్తు గెలిపించుకున్న నేతలే తీసుకోవాలి. కానీ నిజంగా వాళ్లు మాత్రం అంతరాలను అవకాశాలుగా మలుచుకుని, కింది మెట్టువాడిని ఇక్కడే వదిలేసి, పైనున్నోడికి చేయూతనిస్తున్నట్టు నడుచుకుంటూనే ఉన్నారు. అంతరాలు పెరుగుతున్నాయంటే, అభివృద్ధి ఎలా విచ్చలవిడిగా విస్తృతమవుతుందో తెలిసిపోతోంది.

వేదికలే వేరు., నేతలంతా వారే. రంగులు వేరు.., రంగుల మాటు అంతరంగాలు అవే. పదాలూ అవే.., పలికే విధానమే తేడా. ఎన్నికలే ఎజెండా.., ఎదురుగా కూర్చున్న వింటున్న ప్రజలే వారికి పదవిని కట్టబెట్టే నిధి. మాటలతో మెస్మరైజ్.., చేతల్లో సర్ ప్రైజ్. ‘మేమొస్తే మీకు బలం.., మీరే మా బలగం..’ అని ఒకరంటే.., ‘మీమే మీరు.., మీరే మేమని..’ మరొకరు. ప్రజలు కనిపిస్తే చాలు పూనకాలు వచ్చే నేతలు అంతా మరో కోణంలో మాత్రం ఎవరి వ్యాపకాలు వారివిగా కొనసాగుతారు. నిజంగా ప్రజా సేవే కర్తవ్యం, అభివృద్ధే ఎజెండా అయినప్పుడు అంతా కలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే మార్పు దానంతట అది కనిపిస్తుందనే కనీస యావ ఉండదు అనుకోవడం అవివేకమే.

ఎక్కడి వారు అక్కడ కూర్చుని సవాళ్లు.., ప్రతి సవాళ్లు విసురుకోవడం ఇప్పుడు ప్రత్యేక ట్రెండ్ గా నడుస్తోంది. ఎప్పటి నుంచో ఉన్నదే అయినా, ఈ మధ్య కాలంలో ఆ మాదిరి మాటలు యుద్ధాలు పెరుగుతున్నాయి. మీడియా కూడా మధ్యవర్తిత్వం నెరుపుతున్నదా అన్నట్టుగా ఇటు వారి మాటలు అటు.., అటు వారి మాటలు ఇటూ మోసుకెళ్తూ తనదైన వంటకాలు తయారు చేస్తున్నాయి. నాలుగో స్తంభం తన పనిని తాను చేస్తున్న విషయం పక్కన బెడితే, అసలు నేతలంతా ప్రజలకు ఫజిల్స్ ఇచ్చే బదులు అంతా కలిసి వారికి వారుగా కుండ బద్ధలు కొట్టినట్టుగా నడుచుకునే దిశగా ఎందుకు ఆలోచించడం లేదనేదే అస్సలు సమాధానమే దొరకని ప్రశ్న. ఆటలో ప్లేయర్లు అంతర్గతంగా మాత్రమే మారుతుంటారు. ఈ జట్టు కాకపోతే ఆ జట్టు.., ఆ జట్టు కాకపోతే మరో జట్టు.. చివరకు ఏ జట్టు కాకపోయినా స్వతహాగా తనో జట్టు కూర్పు. అంతే గానీ ఆటగాళ్లు వారే, ఆట అదే. కానీ ఆడుకోవడం మాత్రం జనాలతోనే. మరో యాడాది పడుతుందనుకుంటున్న సాధారణ ఎన్నికలు ఇష్యూ కాకతాళీయంగా ఈ వేసవి నుంచే కాక రేపుతున్నది. అందునా విచ్చలవిడిగా పార్టీ ప్రధాన నేతలంతా హస్తినా నుంచి వచ్చి హామీలు గుప్పించడం, ఎదుటి వారిపై దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత స్థానిక నేతలంతా వాళ్లలో వాళ్లు బస్తీమే సవాళ్లు విసురుకొని ఆనక ఎక్కడి వారు అక్కడ ప్రజలకు నాలుగు రోజుల ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చి స్తబ్ధుగా ఉండడం ఇప్పుడు నిత్యం కృత్యంగా కనిపిస్తున్న దృశ్యాలే.

సమాధానాలు చెప్పలేని ప్రశ్నే ఉండదు. ఆ మాటకొస్తే పరిష్కారం లేని సమస్యే ఉండదు. ‘‘అంతా వాళ్లే అయినప్పుడు అసలు విషయం ఏడబోతున్నట్టో అన్నట్టా.. ఎనకటికొకడు..’’. నిద్ర లేచింది మొదలు పక్కలోకి వెళ్లే వరకు కాలికి బలపం కట్టుకుని తిరిగే నేతలు.., ఎక్కడికి వెళ్లిన చేతిలో మైకు.., పక్కన అనుచరులు.., ముందు జనం. మైకులు పేలేలా, స్పీచ్ లు, చెవి తుప్పు వదిలేలా హామీలు ఇది చాలు వారికి. కానీ, కాలే కడుపునకు గంజి పోసినవాడే రక్షకుడు. అవసరాలను అటకెక్కించి, అనవసరమైన వాటితో పబ్బం గడిపితే తీరేదెలా. పూటకో మాటతో, సీజనల్ వారీగా వ్యవహారం నడుపుతూ ప్రజలకు కావాల్సిన వాటిని పక్కన బెట్టి, అవసరం లేని వాటిని హామీలుగా గుప్పిస్తుంటే అసలైన ఫలాలు చేతికందేదెప్పుడు. ప్రభుత్వాలు మార్గదర్శకంగా ఉండాలి.., ప్రతిపక్షాలు ప్రజా పక్షాన పోరాడాలి అనేది కనీస ధర్మం. ఎవరి పనిని వారు చేసుకుంటూ వెళ్తే ఎక్కడా ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ప్రజా సౌఖ్యం దానంతట అదే దరిచేరుతుంది. హామీలకు ఇచ్చే ప్రాధాన్యం, నెరవేర్చేందుకు ఇస్తే అంతా బాగుంటుంది.

భూమిని చూపించాలి.., నీటి సౌకర్యాన్ని కల్పించాలి., అవసరమైతే మరేమైనా ఇతర వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలి. అంతేగానీ, అదిగో భూమి, ఇదిగో నీరు., వాటినే చూస్తూ గట్టున పడుకో పంటంతా అదే పండుతుందని పని చేసే వారిని కూడా చేయనివ్వకుండా, ఒళ్లు వంచే వారిని కూడా సోమరులను చేస్తే ముందు తరానికి ఇచ్చే సందేశం ఏంటి..? దాచిపెట్టి భావితరాలకు అందించేది ఏముంటది. పథకాలు వికృత విన్యాసాలు చేస్తుంటే, ప్రజలు మాత్రం వాటినే పట్టుకుని వేలాడుతారు తప్ప ఇంకేం చేస్తారు. శాశ్వతంగా ముంచుకొచ్చే ఉపద్రవాలు వదిలి.., షార్ట్ టైంలో కలుగుతున్న ఆనందాలనే తలుచుకుంటూ పుణ్య కాలాన్ని కాస్త వృథా చేసుకుని చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం వెతుక్కోవడంలో అంతా తలమునకలవుతున్నారు.

ఎవరి శక్తి వారిది. ఎవరి స్థాయి వారిది. ప్రశ్నలు సంధిస్తూ, సమాధానాలు రాబట్టుకోవడానికి ఇవేం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కావు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలేమీ ఇన్విజిలేటర్లు కాదు. అందరి ప్రశ్నలు అంతిమంగా ప్రజలకు బాగుచేసేవిగా ఉండాలి తప్ప., పార్టీల ప్రయోజనాల కోసం ప్రశ్నలను వాడుకుంటే కలిగే ప్రయోజనం ఎవరికి..? ఆటలో గెలుపు ఎవరిదైనా సమఉజ్జీలే తలపడుతారనే విషయాన్ని గుర్తుంచుకుని, ఎవరి ఆటను వారు ఆడుకునే అవకాశం కల్పించాలి. నేతల మధ్య సవాలక్ష ఉండని గాక, ప్రజల తలరాతలు మార్చే అవకాశాన్ని వ్యర్థం చేయకుండా సక్రమంగా వినియోగించుకుంటేనే ఫలాలు అందుతాయి. ప్రజలు విరాజిల్లుతారు. ప్రశ్నలు మీరే ఉంచుకోండి.., కేవలం పథకాల ఫలాలు మాత్రమే అందించండి అదే చాలు.. అదే మేలు..
                                                                       -రాజేంద్ర ప్రసాద్ చేలిక
                                                                             ఎడిటర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments