ఖమ్మం సభతో రాని కొవిడ్
రిపబ్లిక్ డే నిర్వహిస్తే వస్తుందా..!
గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్
జెండా పండుగ వేళా.. మళ్లీ లొల్లి
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించకుండా.. రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కోవిడ్, పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా? అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో రిపబ్లిక్ డే జరుపుకోక పోవడం, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమేనని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. రాజ్‌భవన్‌లోనే ఈ గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ కూడా గణతంత్రి దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కొవిడ్ కారణంగా గతేడాది సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్.. ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు.
Recent Comments