మిర్చి తోటలో దొరికిన రూ.1.10 లక్షల విలువైన గోల్డ్ చైన్ పోలీసులకు అప్పగింత
ఏడాది క్రితం పోగొట్టుకున్న నగ దొరకడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితురాలు
స్పాట్ వాయిస్, గణపురం: తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా నిలువెత్తు నిజాయితీని చాటుకున్న వ్యవసాయ కూలీ అందరి ప్రశంసలూ అందుకుంటోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన దీపిక అనే వ్యవసాయ కూలి తనకు దొరికిన గోల్డ్ చైన్ పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూర్ గ్రామానికి చెందిన భావనపెళ్లి దీపిక అదే గ్రామానికి చెందిన కొందరితో కలిసి సోమవారం చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో మిర్చి ఏరడానికి వెళ్లింది. పని ముగించుకుని కాలినడకన వస్తున్న దీపికకు చెరువు కట్ట సమీపంలో రెండు తులాల గోల్డ్ చైన్ దొరికింది. ఈ విషయాన్ని తన తండ్రి కోటేష్ కు తెలియజేయగా.. కోటేష్, కూతురు దీపిక కలిసి బంగారు గొలుసును గణపురం పోలీసులకు అప్పగించింది. పోలీసులు విచారణ చేయగా చల్లగరిగ గ్రామానికి చెందిన తోట లచ్చక్క ఏడాది క్రితం అదే తోటలో మిర్చి ఏరడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గోల్డ్ చైన్ కింద పడిపోయింది. చైన్ కోసం లచ్చక్క ఎంత వెతికినా దొరకలేదు. దీంతో లచ్చక్క చిట్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి లచ్చక్క ధరించి ఉన్న ఫొటోలను ఆధారంగా చేసుకొని గోల్డ్ చైన్ లచ్చక్కదిగా గుర్తించారు. లచ్చక్కను గణపురం పోలీస్ స్టేషన్కు పిలిపించి గోల్డ్ చైన్ అందజేశారు. సంవత్సరం తర్వాత తిరిగి గోల్డ్ చైన్ దొరకడంతో లచ్చక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న తండ్రి, కూతురైన కోటేష్, దీపికను చిట్యాల సీఐ పులి వెంకట్, చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, ఉపసర్పంచ్ రజియా అభినందించారు.
కూలీకి దొరికిన గోల్డ్ చైన్.. ఏం చేసిందంటే..?
RELATED ARTICLES
Recent Comments