51 అడుగులకు చేరిన నీటి మట్టం
అంధకారంలో విలీన మండలాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ఉదయానికి గోదావరి నీటిమట్టం 51 అడుగులకు చేరుకున్నట్లు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. నీటిమట్టం 53 అడుగుల వరకు పెరగవచ్చని తెలిపారు. ఇప్పటికే భద్రాచలం వద్ద కల్యాణ కట్ట, స్నాన ఘట్టాల ప్రాంతాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. వారం రోజుల నుంచి విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
భద్రాచలం వద్ద ఉగ్రగోదారి..
RELATED ARTICLES
Recent Comments