పాకాల -రంగాయ చెరువు ప్రాజెక్టు నీటి విడుదల
సందర్శించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట: గోదావరి జలాలు పాకాల చెరువుకు చేరారు. పాకాల -రంగాయ చెరువు ప్రాజెక్టు నుంచి కొద్ది రోజుల క్రితం నీరు విడుదల కాగా, ఖానాపురం మండలం కీర్యా తండా వద్దకు నీరు చేరాయి. బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించి నీటిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అయితే రంగాయ చెరువు ప్రాజెక్టు ద్వారా అడవి మార్గాన పాకాలకు నీటిని తరలించి, అక్కడి నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. అధికారికంగా ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ రైతుల కోరిక మేరకు రెండో పంటకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. మొదటి పంటకే నీటి విడుదల ప్రశ్నార్థకంగా ఉన్న రోజుల నుంచి రెండు పంటలకు నీటిని అందిస్తున్న రోజులు రావడం సంతోషకరమన్నారు. ముందస్తుగా చేసిన కాల్వల పూడిక తీత పనులతో చివరి పంట పొలం వరకు ఎక్కడా అవాంతరాలు లేకుండా సరిపడా నీరందనుందన్నారు. బీటలు బారిన నేల నుంచి నీటి ప్రవాహం పరవళ్లు తొక్కడం చూసి పెద్ది సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, జెడ్పీటీసీ బత్తిని స్వప్న శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రామ సహాయం ఉమా ఉపేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పాకాలను ముద్దాడిన గోదావరి
RELATED ARTICLES
Recent Comments