అరగంటలోనే వినాశనం
కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యం
నేలవాలిన వరి, మామిడి
గ్రామాల్లో కూలిన ఇళ్లు….
లేచిన పైకప్పులు
విరిగి పడిన విద్యుత్ స్తంభాలు..
కూలిన చెట్లు
అంధకారంలో గ్రామాలు
పంట నష్టం అంచనా సర్వే నిర్వహించాలని రైతుల వేడుకోలు
స్పాట్ వాయిస్, గణపురం : గణపురం మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన బీభత్సానికి అనేక ఇల్లు ధ్వంసం అయ్యాయి. చెట్లు విరిగి రోడ్లపై పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యంపై పట్టాలు కప్పే సమయం ఇవ్వకుండా గాలులు బీభత్సం సృష్టించాయి. చేతి కొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం కొన్నిచోట్ల తడవగా.. మరికొన్నిచోట్ల టార్పాలిన్లు, బరకాలు కప్పి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసిపోయినట్లు తెలిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో ఉండి పోయారు. బుధవారం సాయంత్రం నిలిచిన విద్యుత్తు సరఫరా గురువారం రోజు వరకు పునరుద్ధరించలేదు. దీంతో ఎండవేడిమికి, ఉక్కపోతకు చిన్నారులు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుర్రకాయల గూడెం సమీపంలో రత్నం బాబుకు చెందిన ఏడు ఎకరాల మామిడి తోట గాలి వానకు పూర్తిగా కాయలు నేలరాలడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
విద్యుత్‌శాఖకు భారీగా నష్టం
గణపురం మండలంతో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సవానికి విద్యుత్‌శాఖకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం వంద విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు అంచనా. అయితే యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని గురువారం సాయంత్రానికి గాని లేక శుక్రవారం నాటికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఇస్తామని, అప్పటి వరకు ప్రజలు సహకరించాల్సిందిగా ఏఈ వెంకటరమణ కోరారు.
Recent Comments