సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్పాట్ వాయిస్, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. సోమవారం రాత్రి టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ముగియగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడి.. రక్తపు మడుగులో పడి ఉన్న పవన్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పవన్‌పై మూకుమ్మడిగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. తోట పవన్ పై జరిగిన దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ను చికిత్స పొందుతున్న ఆస్పత్రికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోకు తరలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడి నుంచి పాదయాత్రకు సీపీ ఆఫీస్ కు రేవంత్ రెడ్డి వెళ్లారు.
Recent Comments