Tuesday, September 17, 2024
Homeజిల్లా వార్తలు‘సింగరేణి’ మూసివేతకు కేంద్రం కుట్ర : గండ్ర సత్తన్న

‘సింగరేణి’ మూసివేతకు కేంద్రం కుట్ర : గండ్ర సత్తన్న

కార్మికులకు అండగా ఉంటాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలు
ఐఎన్‌టీయూసీతోనే గని కార్మికులకు మేలు
గేట్ మీటింగ్‌లో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు
స్పాట్ వాయిస్, గణపురం: నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా ముంచేందుకు కుతంత్రాలు పన్నుతోందని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం బస్వరాజుపల్లి కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు (8 ఇంక్లైన్)లో ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ మణిమాణిక్యం సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలుగా మారి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేసుకుంటూ రైతు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను, రాష్ట్రం ప్రభుత్వం నిత్యావసరాలు, బస్, విద్యుత్‌ చార్జీల ను పెంచి నిరుపేద, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో డీఎంఎఫ్‌టీ నిధులను సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలన్నారు. ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి రానున్నదని కాంగ్రెస్ పార్టీనే అని, తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్దీతో పాటు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో సింగరేణి సంస్థను రక్షించేందుకు, కార్మిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి జరగనున్న సింగరేణి ఎన్నికల్లో మీ మేలు కోరే ఐఎన్‌టీయూసీని గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బుచ్చయ్య పిట్ సెక్రెటరీ, కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments