గణపసముద్రం మత్తడిని సందర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ
స్పాట్ వాయిస్, గణపురం: భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం చెరువు నిండుకుండలా మారి కనువిందు చేస్తోంది. సరస్సు మత్తడి పోస్తుండడంతో బుధవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మత్తడిని సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మత్తడి అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సిరికొండ మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో చెరువులన్నీ నిండాయని.. వాగులు, వంకలు జోరుగా ప్రవహిస్తుండటంతో రైతు కళ్లు ఆనందంతో నిండిపోయాయని అన్నారు. భారీవర్షాలకు గణప సముద్రం సరస్సు నిండి మత్తడి పడడం ఎంతో శుభపరిణామం అన్నారు. తన హయాంలో రూ.17 కోట్లతో రామప్ప సరస్సు నుంచి గణపసముద్రం సరస్సు వరకు గ్రావిటీ కెనాల్ నిర్మించి రిజర్వాయర్‌గా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు గణపసముద్రం మత్తడి పడితే నెలరోజుల పాటు ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడేదని, అదేవిధంగా మోరంచవాగు ఉధృతికి వాగవతలి 22 గ్రామాలకు రాకపోకలు ఉండేవి కావన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ1. 95 లక్షలతో మత్తడి వద్ద హై లెవెల్ వంతెన, మోరంచ వాగుపై రూ 3.50 కోట్లతో రెండు హై లెవెల్ వంతెనలను నిర్మించి ప్రజల కష్టాలను తీర్చినట్లు చెప్పుకొచ్చారు. 30 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న గణపసముద్రం పూర్తిగా నిండడంతో ఐదు మండలాల ప్రజల తాగునీటిని అందించడంతోపాటు ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలకు సమృద్ధిగా ఈ సరస్సు ద్వారా సాగు నీరు అందుతుందన్నారు. అనంతరం స్థానిక నాయకులు, గ్రామస్తులు మత్తడి వద్ద సిరికొండతో సెల్ఫీలు దిగారు. ఆయన వెంట ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, బైరగాని కుమారస్వామిగౌడ్, వడ్లకొండ నారాయణగౌడ్, డాక్టర్ జన్నయ్య, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, రత్నం రవి, మామిడి నరసింహస్వామి, తంగళ్ళపల్లి వెంకట్, వెంపటి అశోక్, కొవ్వూరు శ్రీనివాస్, పోతర్ల మల్లికార్జున్, చాంద్ పాషా, తదితరులు ఉన్నారు.
సిరికొండ పరామర్శ
మండలంలోని కర్కపెల్లి గ్రామంలోని కన్నూరు నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
Recent Comments