టీఆర్ఎస్ టు బీఆర్ఎస్
తెలంగాణ నుంచి దేశం కోసం
ప్రత్యేక పోరు రగిలించిన టీఆర్ఎస్
నేడు జాతీయ పార్టీగా గుర్తింపు
ఉద్యమ నేత నుంచి జాతీయ నేతగా కేసీఆర్
రేపు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
తెలుగు గడ్డ మరో రాజకీయ సంచలనానికి వేదికైంది. తెలుగు రాష్ట్రంలో మరో జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. నేడు జాతీయ పార్టీగా అవతరించింది. దేశ రాజకీయాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ నేతగా మారారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కేసీఆర్ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ముందు నుంచి పక్కా లెక్కతో జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను మార్చడంపైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది. వందల గంటల మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన లక్ష్యమైన తెలంగాణ రాష్ర్టాన్ని ముద్దాడి, ప్రభుత్వ పగ్గాలు అందుకుని మరో మేథోమథనం కోసం రెడీ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, పరిణామం, ఉత్థాన పతనాలు, మహాశక్తిగా మారిన తీరు మీకోసం.
-స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ మేధోపరమైన మద్దతు అందించారు. ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీచేసి, అసంతృప్తితో రగులుతున్న తెలంగాణ ప్రజలను రాష్ట్ర ఏర్పాటు దిశగా నడిపించింది. తెలంగాణ ఏర్పాటు ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ విజయవంతమైంది. సుమారు ఏడాదికిపైగా జలదృశ్యం లోనే టీఆర్ ఎస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2001 మే 17న కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభ ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు బీజం వేసింది. 2004లో వైఎస్ ప్రభుత్వం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్ ఉన్న స్థలాన్ని టీఆర్‌ఎస్ కు కేటాయించింది. ముందుగా రేకుల షెడ్డు వేసి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని ప్రారంభించారు. 2006లో తెలంగాణ భవన్ ను ప్రారంభించారు. 2006లో తెలంగాణ భవన్ ఏర్పాటైంది. మరుసటి సంవత్సరమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు. 2022 అక్టోబరు 5న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానించారు
ఉద్యమంలో అగ్రభాగం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే.. మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపింది టీఆర్ఎస్. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విజయం సాధించింది. 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్.. ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. ఇలా మొదలైన ప్రస్థానంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మొండిచేయి చూపడంతో బయటికి వచ్చిన కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. గతంలో కంటే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఓ చరిత్ర అనే చెప్పొచ్చు. 2009లో మహాకూటమితో జట్టుకట్టిన కేసీఆర్..టీడీపీతో పాటు కమ్యూనిస్టులతో జై తెలంగాణ అనిపించారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఓ దశలో టీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత 14 ఎఫ్ పై సుప్రీంతీర్పుతో కేసీఆర్ దీక్షకు దిగడంతో టీఆర్ఎస్ మళ్లీ ఊపిరి పోసుకుంది. తిరుగులేని ఆదిపత్యాన్ని సాధించింది. ఆరోజు నుంచి 2014 వరకు ఉద్యమాన్ని నడిపించటంలో అగ్రభాగాన నిలించింది.
నమ్మకం.. అపనమ్మకాల మధ్య..
హుస్సేన్‌సాగర్ ఒడ్డున జలదృశ్యంలో 14 ఏండ్ల క్రితం 2001 ఏప్రిల్ 27న కేవలం వందలమంది ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఊపిరిపోసుకున్నది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969నాటి ఉద్యమకారులు, విద్యావంతులు, కొందరు మేధావులు తప్ప చెప్పుకొదగ్గ రాజకీయ నాయకుల్లేరు. ఒక రకమైన గంభీరమైన వాతావరణం. నమ్మకం-అపనమ్మకాల మధ్య తెలంగాణ ఆకాంక్ష మాత్రమే రాజ్యమేలిన ఘట్టం. తెలంగాణ ఉద్యమప్రస్థానంలో మరో నూతన రాజకీయపార్టీ ప్రారంభ ప్రకటన వెలువడింది. గత ఉద్యమపంథాకు భిన్నంగా పార్లమెంటరీ పంథాలోనే రాష్ట్రసాధన లక్ష్యంగా ప్రకటించారు. ఆ వేదిక మీద ఉద్యమనేత కే. చంద్రశేఖర్‌రావు డిప్యూటీ స్పీకర్, శాసనసభ సభ్యత్వాలను త్యాగం చేస్తూ చేసిన ప్రకటన ఉద్యమానికి ప్రాణప్రతిష్ట చేసింది. నాటి సభలో కేసీఆర్ ప్రసంగం, పదవీ త్యాగం, భవిష్యత్ కార్యక్రమంగా కరీంనగర్ సింహగర్జన ప్రకటన తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పాయి. దశాబ్దాలుగా అణచిపెట్టుకున్న తెలంగాణ ఆకాంక్ష పెల్లుబికింది.
ఎదురుదెబ్బలు.. ఘన విజయాలు
ఉద్యమ పార్టీకి ఎన్నో ఎదురుదెబ్బలు.. ఘన విజయాలు దక్కాయి. తెలంగాణకు నో అనే పార్టీ ఉండరాదనే ఎత్తుగడతో 2009లో టీడీపీతో పొత్తుకు టీఆర్‌ఎస్ ఓకే చెప్పింది. ఎన్నికల్లో టీడీపీయే స్వయంగా వెన్నుపోట్లకు దిగడంతో చేదుఫలితాలు వచ్చాయి. మళ్లీ ఒక స్తబ్దత. కొంతకాలం వ్యూహాత్మక మౌనాన్ని పాటించిన ఉద్యమ నేత.. రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాక హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం ముందుకు వచ్చింది. కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష ప్రకటించారు. డిసెంబర్ 5న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన కేంద్రం ముందుకుకదిలింది. సచివాలయంలో అఖిలపక్షంలో అన్ని పక్షాలు తెలంగాణకు ఓకే చెప్పాయి. 9 డిసెంబర్ అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన వెలువడింది. 24 గంటల్లోనే సీమాంధ్ర నాయకుల కుట్రలతో ఆ ప్రకటన వెనక్కిపోగా డిసెంబర్ 23న తెలంగాణ రాజకీయ జేఏసీ ఆవిర్భవించింది. టీఆర్‌ఎస్ జేఏసీతో మమేకమై ఉద్యమ పంథా అనుసరించింది. 2010జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చరిత్రలో కనివిని ఎరుగని మెజార్టీలతో గెలిచారు. కాంగ్రెస్ టీడీపీలు డిపాజిట్లు కోల్పోయాయి. మిలియన్ మార్చ్‌లు, సాగరహారాలు, సకలజనుల సమ్మెలు ఆందోళన ఏదైనా టీఆర్‌ఎస్ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణలో జూన్ 2న రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఆరు దశాబ్దాల కల ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
కరీంనగర్ సభతోనే..
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పింది టీఆర్‌ఎస్ బలాన్ని బలగాన్ని చాటింది కరీంనగర్ సింహగర్జన సభనే. తమది ఒంటరి పోరాటం కాదన్న సందేశంతో నాటి సభకు ముఖ్యఅతిథిగా శిబూసొరేన్‌ను ఆహ్వానించారు. 2001 మే 17న నిర్వహించిన నాటి సభకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చిన తీరు మహామహా రాజకీయ విశ్లేషకులను నివ్వెర పరిచింది. ఎడ్లబండ్లనుంచి మొదలుకుని లారీల దాకా ప్రజలే స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో వాహనాలు మాట్లాడుకుని ప్రవాహంలా కదిలివచ్చారు. ఆ వేదిక మీదే పలువురు ప్రధాన పార్టీ రాజకీయవాదులు గులాబీ జెండాను అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్ని అంశాలను స్పృశిస్తూ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు ప్రజల గుండెల్లోకి నేరుగా దూసుకువెళ్లింది. ఉద్యమ పంథా లోతు, నాయకత్వ పరిణితిపై ప్రజల్లో విశ్వాసం పాదుగొల్పింది.
మహాశక్తిగా..
టీఆర్‌ఎస్ మిగిలిన పార్టీలేవీ అందుకోనంత ఎత్తుకు ఎదిగింది. సమీప భవిష్యత్ లో ఇంకేపార్టీ పోటీపడే అవకాశం కూడా ఇవ్వలేనంతగా బలపడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. మరో వైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరుగగా, మే 16న ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ 63, 11లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలుపొంది రెండో సారి అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు ప్రభుత్వంగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నది. సమర్థ నాయకత్వం, అంకితభావం కలిగిన కార్యకర్తల బలం, బంగారు తెలంగాణ రూపశిల్పిగా ప్రజలు విశ్వసిస్తున్న తీరు పార్టీకి జోష్ నిస్తోంది.
దేశ్ కీ నేత
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఉద్యమ పార్టీగా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా ముందుకొచ్చింది. ఓ వైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథా…! ఇలా దశాబ్ధానికిపైగా ఎన్నో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. అటుపోటులు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి… దేశ రాజకీయ యవనికపై తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. ఇప్పుడు దేశం కోసమంటూ పార్టీ జాతీయ స్థాయిలో (బీఆర్ఎస్) విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆ దిశగా పావులు కదుపుతూ వచ్చారు. దేశవ్యాప్త పర్యటనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంటే లక్ష్యంగా అడుగులు వేశారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీల నేతలతో ముమ్మరంగా చర్చలు జరిపారు. కేంద్రంలోని మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో భాగంగా గత దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటించారు.
రేపు జెండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందింది. ఉద్యమ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు సీఈసీ సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న (శుక్రవారం) మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో తనకు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపనున్నారు. అనంతరం కేసిఆర్ బీఆర్‌ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యవర్గసభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసీసీబీ అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని కేసీఆర్ తెలిపారు.
Recent Comments