Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్రేపు వరంగల్ లో జానపద గిరిజనోత్సవాలు

రేపు వరంగల్ లో జానపద గిరిజనోత్సవాలు

*జానపద గిరిజన విజ్ఞానం-పరిశోధనా ధోరనలు-భవిష్యత్తు అనే అంశాలపై చర్చ సదస్సు
*పలువురు కళాకారులకు ప్రతిభా పురస్కారాలు
* అరుదైన కళారూపాల ప్రదర్శన
స్పాట్ వాయిస్, వరంగల్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ఈ నెల 22న జానపద గిరిజనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న ఆదివారం ప్రకటనలో తెలిపారు. గిరిజనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10. 30 గంటలకు ‘జానపద గిరిజన విజ్ఞానం-పరిశోధనా ధోరణులు భవిష్యత్తు’ అనే అంశంపై జరిగే చర్చ సదస్సులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడు కిషన్ రావు ముఖ్యఅతిథిగా, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య నాగపట్ల భక్తవత్సలరెడ్డి ఆత్మీయ అతిథిగా, ఆద్యకల వ్యవస్థాపకులు ఆచార్య జయధీర్ తిరుమల్ రావు విశిష్ట అతిథిగా, పారిస్ ఫ్రెంచి నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ ఆచార్య డేనియల్ నేజర్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జానపద గిరిజన విజ్ఞాన పీఠం ప్రచురించిన పలు పుస్తకాలు, వీసీడీల ఆవిష్కరణ, ప్రముఖ కళాకారులకు సన్మానం, ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జానపద గిరిజన కళాకారుల ప్రదర్శన, జానపద గిరిజన సంగీత వాయిద్యాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

* పలు ఆవిష్కరణలు..
అలాగే జానపద గిరిజన విజ్ఞానం జాతీయ సదస్సు పత్రాలు రెండో సంపుటి, గౌడు గిరిజనుల జీవన విధానం (పనసపల్లి), కమ్మర గిరిజనుల జీవన విధానం (మొండికోట కర్ణికలంక), ఖోంధ్ గిరిజనుల జీవన విధానం (ఏబులం గోడిసింగి), గదబ గిరిజనుల జీవన విధానం (కుమ్మరాంపల్లి) పుస్తకాల ఆవిష్కరణతో పాటు తోటి గిరిజన కథ మాసయ్య పటం కథల వీసీడీల ఆవిష్కరణ ఉంటుందన్నారు.

* ప్రముఖ కళాకారులకు సన్మానం..
జానపద గిరిజన కళారూపాలపై విశేష సేవలందించిన ప్రముఖ కళాకారులు గజవెల్లి చంద్రయ్య చిందు యక్షగానం, డక్కలి పోచప్ప కిన్నెరవాద్యం, భట్టు కిషన్ భట్స్ కథ, చింతల గురుపాదమ్ గుర్రం పటం కథ, మొలంగూరి భిక్షం ఏనూటి పటం కథ, అంగుళాకుర్తి రామ్మూర్తి రుంజ వాద్యం, వెడ్మా శంకర్ తోటి గిరిజన కథ, ఢిల్లీ రాంబాబు డోలి కళాకారులకు ప్రతిభ పురస్కారాలు అందజేయునట్లు తెలిపారు. సదస్సులో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, జానపద గిరిజన సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చిస్తారని తెలిపారు. నగరంలోని సాహితీవేత్తలు, కళాకారులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పీఠాధిపతి వెంకన్న కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments