ఆర్ట్స్ కాలేజీ నుంచి క్యాంపస్ కు ఓ లెక్చరర్ ట్రాన్స్ ఫర్ కోసం ఒత్తిడి
మాజీ వీసీ రమేష్ యూనివర్సిటీని వదిలినా ఆగని అనుచరుల ఆగడాలు
సూటిపోటి మాటలతో వేధింపులు
ఎకనామిక్స్ లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్ పై తెలుగు ప్రొఫెసర్ జ్యోతి ఫిర్యాదు
తనకు ప్రాణహానీ ఉందని ఆవేదన
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: కేయూ మాజీ వీసీ రమేష్ పీడ యూనివర్సిటీకి విరగడైనా.. అతడి అనుచరుల రూపంలో ఉన్మాదం కొనసాగుతూనే ఉంది. పీహెచ్ డీ అడ్మిషన్లలో రమేష్ చేసిన అక్రమాలకు, అవినీతికి మద్దతివ్వడమేగా అతడి కక్షసాధింపు చర్యలకు వంతపాడుతూ బహిరంగ ప్రకటనలు ఇచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్ నేత శ్రీధర్ కుమార్ లోథ్.. ఇంకా తన పద్ధతి మార్చుకోవడం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మాజీ వీసీ రమేష్ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నా, అతడి నమ్మిన బంటుగా పని చేసిన ఏఆర్ అశోక్ బాబు ఇల్లు కూల్చివేతకు రంగం సిద్ధమైనా.. శ్రీధర్ కుమార్ లోథ్ లాంటి వ్యక్తులు యూనివర్సిటీలో తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్, తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ జ్యోతిని ఓ లెక్చరర్ ట్రాన్స్ ఫర్ కోసం మహిళ అని చూడకుండ దుర్భాషలాడడం, దళితురాలనే చిన్నచూపుతో తక్కువ చేసి మాట్లాడడం, ఆమె ఆ విషయాన్ని వాట్సప్ గ్రూపులో పెట్టడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. తాను ఓ అభ్యుదయ విద్యార్థి సంఘంలో పని చేశానని తరచూ చెప్పుకునే.. ఈ లీడర్ ఇలా మహిళలను తక్కువ చేసి మాట్లాడడమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. దీంతో శ్రీధర్ కుమార్ లోథ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని, అతడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తెలుగు డిపార్ట్ మెంట్ లో ఏం జరిగిందంటే..
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పని చేస్తున్న తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్ కర్రె సదాశివ్ , మహిళా పీజీ కాలేజీలో పని చేస్తున్న పార్ట్ టైం లెక్చరర్ అన్నపూర్ణ యూనివర్సిటీ క్యాంపస్ కు వచ్చేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త వీసీ వచ్చాక ట్రాన్స్ ఫర్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ జ్యోతి ఉన్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ లెక్చరర్ సంఘం నేత శ్రీధర్ కుమార్ లోథ్, కర్రె సదాశివ్ శనివారం తెలుగు విభాగానికి వెళ్లి రెండు గంటలపాటు ట్రాన్స్ ఫర్ విషయమై దుర్భాషలాడారు. చేతకాకుంటే పదవికి రాజీనామా చేయాలని, సీటు వదిలిపోవాలని బెదిరింపులకు దిగినట్లు ప్రొఫెసర్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు తన చాంబర్ లో కూర్చుని కదల్లేదని, తనను ఏ పని చేసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు చెప్పారు. శ్రీధర్ కుమార్ లోథ్ తో తనకు ప్రాణహానీ ఉందని, తనకు ఏం జరిగినా వీరిదే బాధ్యత అని, చాలా బాధతో వేదనతో తెలియజేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఇంటిగ్రేషన్ అనే వాట్సప్ గ్రూపులో ఆమె పోస్ట్ చేశారు. శ్రీధర్ కుమార్ లోథ్, మరో ఇద్దరి వేధింపుల విషయమై ఇన్ చార్జీ వీసీ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి, అకుట్ జనరల్ సెక్రటరీ మామిడాల ఇస్తారికి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఎవరికి ఎక్కువ సీనియార్టీ ఉంటే వారినే ట్రాన్స్ ఫర్ చేయాలని, నిబంధనల ప్రకారం అన్నపూర్ణ సీనియర్ అయినందున ఆమెనే బదిలీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ఇవన్నీ చెప్పినా వినిపించుకోకుండా శ్రీధర్ కుమార్ లోథ్, సదాశివ్ తనను తీవ్రమైన పదజాలంతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
శ్రీధర్ కుమార్ లోథ్ ది మొదటి నుంచి ఇదే తీరు..
యూనివర్సిటీ వీసీగా రమేష్ పని చేసిన సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్ లీడర్ గా శ్రీధర్ కుమార్ లోథ్ ఆడింది ఆట.. పాడింది పాటగా నడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో , యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్లు మూడు చొప్పున ఉండడంతో కొన్నాళ్ల క్రితం రద్దు చేసి.. ఒక్కటిగా పని చేస్తున్నారు. కానీ స్వయం ప్రకటిత అధ్యక్షుడిగా చెప్పుకుంటూ శ్రీధర్ కుమార్ లోథ్ పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత వీసీ రమేష్ హయాంలో తనకు వ్యతిరేకులుగా ఉండేవాళ్లను ట్రాన్స్ ఫర్ చేయించడం, అనుకూలంగా ఉండేవాళ్లకు అడ్మినిస్ట్రేషన్ పదవులు ఇప్పించడం చేశారనే విమర్శలు ఉన్నాయి. పీహెచ్ డీ సీట్ల అక్రమాల్లో, అమ్మకాల్లో సదరు లీడర్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. వీసీ రమేష్ కు మధ్యవర్తిగా ఉంటూ డబ్బులు తీసుకుని అడ్మినిస్ట్రేషన్ పోస్టులు, పీహెచ్ డీ సీట్లు ఇప్పించాడనే పేరుంది. ఇదే విషయమై ఏబీవీపీ, బీసీ విద్యార్థి సంఘాలు బహిరంగంగానే ఆరోపించాయి. అంతేగాక బోర్డు ఆఫ్ స్టడీ స్ చైర్మన్ గా కాంట్రాక్ట్ లెక్చరర్ ను నియమించొద్దనే యూజీసీ నిబంధనతో తెలుగు విభాగం బీఓఎస్ గా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్ మంథని శంకరయ్యను తొలగిస్తూ.. ఆ బాధ్యతలు ప్రొఫెసర్ జ్యోతికి అప్పగిస్తూ మూడు నెలల క్రితం రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా.. తనను చార్జీ తీసుకోవద్దంటూ శ్రీధర కుమార్ లోథ్ బెదిరింపులకు గురిచేసినట్లు ప్రొఫెసర్ జ్యోతి గుర్తు చేశారు.
చేయని సత్కారం చేసినట్లు..
మాజీ వీసీ రమేష్ అక్రమాలపై విచారణకు మే 18న రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. వాస్తవానికి మే 21న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఓయూ, శాతవాహన, మహత్మాగాంధీ తదితర రాష్ట్రంలోని మిగతా యూనివర్సిటీల వీసీలంతా గౌరవంగా, సన్మానాలతో పదవీ విరమణ పొందారు. కానీ పదవీ విరమణకు మూడు రోజుల ముందే చాలా అవమానకరంగా యూనివర్సిటీని వీడాల్సి వచ్చింది. అయినా మే 21న ఫార్మసీ కాలేజీలో రమేష్ కు సన్మానం చేసేందుకు శ్రీధర్ కుమార్ లోథ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాడు. ఇందుకోసం అడ్మినిస్ట్రేషన్ పదవులు పొందిన కాంట్రాక్ట్ లెక్చరర్ల నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు సన్మాన కార్యక్రమంపై దాడి చేసే అవకాశముందనే ఇంటెలిజెన్స్ చేసిన హెచ్చరికలతో ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయినా యూనివర్సిటీలో చివరి రోజు రమేష్ సేవలను కొనియాడుతూ పత్రికలకు ప్రకటనలు విడుదల చేయడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
చర్యలుంటాయా ?
గతంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేసిన బన్న అయిలయ్యను డ్యూటీ విషయమై అడిగినందుకే.. తనతో దురుసుగా మాట్లాడరంటూ అధికారం చేతిలో ఉంది కదా అని కామర్స్, ఇంగ్లిష్ విభాగాలకు చెందిన ఇద్దరు కాంట్రాక్ట్ లెక్చరర్లను రిజిస్ట్రార్ కు సరెండర్ చేశారు. ఒక దశలో ఉద్యోగం నుంచి తొలగించినంత పని చేశారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత మూడు నెలలకు తిరిగి ఉద్యోగంలో కొనసాగే అవకాశమిచ్చారు. మరి ప్రొఫెసర్ జ్యోతిని దుర్భాషలాడిన, బెదిరింపులకు దిగిన శ్రీధర్ కుమార్ లోథ్ పై యూనివర్సిటీ ఇన్ చార్జీ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మహిళా ప్రొఫెసర్ ను అవమాన పరిచిన వారిని శిక్షించాలి…..
కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం మహిళా ప్రొఫెసర్ తో ఒప్పంద అధ్యాపక సంఘ నాయకులు అవమాన పరిచే విధంగా మాట్లాడినట్లు సదరు ప్రొఫెసర్ వీసీ రిజిస్ట్రార్ లతో బాటు ఆకుట్ సంఘ బాధ్యులకు కూడా ఫిర్యాదు చేసిందని ఈ సందర్భంగా ఆకుట్ జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ టీచర్ ను అవమాన పరిచే విధంగా మాట్లాడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్, వీసీని కోరినట్లు తెలిపారు.
Recent Comments