Sunday, November 24, 2024
Homeటాప్ స్టోరీస్చేయి చాచేందుకు సిగ్గుండాలే..!

చేయి చాచేందుకు సిగ్గుండాలే..!

సిగ్గుండాలే..!

జీతం చాలనట్టు ‘ఎక్స్ ట్రాలు..’
దినదినం పెరుగుతున్న లంచావతారులు..
దిగజారుతున్న ఉద్యోగ విలువలు..
ఛీకొడుతున్న సామాన్యులు..
నొక్కడమే లక్ష్యంగా కొందరు ప్రభుత్వోద్యోగులు..

సిగ్గుండాలె. చేసే కార్యంలో పూర్తిగా కాకున్నా, కనీసంగానైనా నిజాయితీ కనబర్చాలే. పని ఉందని వస్తే అది న్యాయబద్ధమైతే చేయాలి.., లేదనిపిస్తే లోపాలు తెలియజేసి సర్దుకుని రండి చేస్తామని తిప్పి పంపాలి. అంతేగానీ ఏ అడ్డమైన పనైనా అడ్డదారుల్లో చేసేందుకు నొక్కుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, అందునా కావాల్సినంత రొక్కాన్ని డిమాండ్ చేస్తూ పతాకస్థాయికి ఎక్కుతున్న కొందరు సర్కార్ ఉద్యోగులు తీరే అత్యంత జుగుప్సాకరం. ‘నమ్మకాలతో పనిలేదు పని గంటలను అమ్ముకోవడమే తమ అసలు పని..’ అని చెలరేగిపోతున్న అలాంటి సర్కార్ సర్వెంట్ల వ్యవహారం వ్యవస్థలపై ఉన్న అంతోఇంతో నమ్మకాన్నీ సన్నగిల్లేలా చేస్తోంది. ఇప్పటికే సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి. తప్పనిసరై పోతే, వెళ్లిన వారిని వెళ్లినట్టుగా అడ్డదిడ్డంగా నొక్కేసి, అటు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సొంత బీరువాలను నింపుకునేందుకు సదరు ‘సార్లు’ పడుతున్న తాపత్రయం వారిని మరింత భయపెడుతోంది. అందున మరో ఉద్యోగ వర్గమైతే ఖాళీ జేబుతో ఆఫీస్ కెళ్లి.., ఎంత ‘బరువు’తో ఇంటికెళ్తామా.. అని టార్గెటెడ్ గా చెలరేగిపోతున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో తెలిసిపోతోంది.

స్పాట్ వాయిస్, క్రైమ్:  ఇందుకు కదా సర్కార్ కొలువులు కావాలనుకునేది. జీతానికి జీతం.., అలవెన్సులకు అలవెన్సులు., సెలవులకు సెలవులు.., కాస్త కష్టపడ్డట్టు నటిస్తే మరిన్ని ఇంక్రిమెంట్లు. ఒక్కసారి కొలువులో కూర్చున్నామంటే జీవితాంతం తీసేసేది ఉండదు.., తిప్పి పంపేది అస్సలే ఉండదు. పైగా ప్రైవేట్ ఉద్యోగుల మాదిరిగా టార్గెట్లూ ఉండవు.., పని పూర్తి చేయాలనే ఒత్తిళ్లు అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ కనిపించవు. ఇన్ని సౌకర్యాల సర్కార్ కొలువులకు అమ్యామ్యాలు అదనపు సదుపాయం ఉండగా ఎవరికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం వద్దనిపిస్తుంది. ‘కాస్త కష్టపడి ప్రభుత్వ కొలువు కొట్టు.. కొద్దిరోజుల్లోనే కోట్లకు పడగెత్తూ..’ అనే సూత్రంతో దూసుకెళ్తున్న ‘హార్డ్ వర్కర్స్’ గురించి అప్పుడప్పుడు ‘ఏసీబీ’ అనే సంస్థ మాత్రమే గుర్తిస్తోంది. గుట్టుగా పని కానిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఉద్యోగులు ఎందరో ఉన్నా, దొరికిన వారే ప్రస్తుతం దోషులు.

జీతం చాలనట్టు ‘ఎక్స్ ట్రాలు..’
సర్కార్ కొలువులు సాధించడమే ఓ అదృష్టంగా భావించే రోజులొచ్చాయి. కొత్త రాష్ట్రావిర్భావం జరిగిన తర్వాత లంచాల వేధింపులు ఉండొద్దని సీఎం కేసీఆర్ అందరికీ ఆమోదయోగ్యమైన జీతాలు పెంచారు. దీంతోనైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు చకచక జరుగుతాయని, సామాన్యులకు కష్టాలు తీరుతాయని భావిస్తే సీఎం ఆశలు కూడా సర్కార్ ఉద్యోగులు అడియాశలే చేశారు. ఎంత జీతమైనానేమి ‘ఎక్స్ ట్రా’ మాత్రం ఎందుకు వదులుకుంటామనే ధోరణి మాత్రం వదలడం లేదు. దీంతో లక్షలకు జీతాలకు తోడు అదనపు వసూళ్లు మరింత పెరిగాయి.

దినదినం పెరుగుతున్న లంచావతారులు..
డిపార్ట్ మెంట్ అనే తేడాలు లేకుండా అన్నింటా లంచావతారులు రోజురోజుకు పెరుగుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మరీ ఎక్కువ సంఖ్యలో ఈ మధ్య కాలంలో ఏసీబీ దాడుల్లో బయటపడడం విచారించాల్సిన విషయం. ఇక రెవెన్యూ ఉద్యోగుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనే భావన అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే కార్యాలయానికి వెళ్లాలంటేనే కాస్తోకూస్తో జేబులో వేసుకుని వెళ్తే తప్ప పనులు కావనే విషయం చిన్నపిల్లాడు మొదలు చదువుకు నోచని వయో వృద్ధుల వరకు తెలుసు. మరీ దారుణమైన విషయం ఏంటంటే దివ్యాంగులను కూడా లంచం పిండకుండా వదలడం లేదు అనేది గమనించాలిక్కడ.

దిగజారుతున్న ఉద్యోగ విలువలు..
గతంలో వయస్సుకు మర్యాదు ఉండేది.., చదువుకు గౌరవం ఉండేది. ప్రస్తుతం విలువలు దిగజారాయి. ఎంత పెద్ద పోస్టులో కూర్చున్న ఉద్యోగి అయినా ఐదు పదికి కూడా చేయి చాపి ఆడగకుండా ఉండలేకపోతున్నాడు. ఉన్నతమైన చదువులు చదివి, సమాజాన్ని ఉద్దరిస్తామని ఊకదంపుడు మాటలు చెప్పే పెద్దపెద్ద సార్లు కూడా సిల్లీగా ప్రవర్తించడం బాధాకరమైన విషయం. నూటికో కోటికో ఒక్కరు అన్నట్టుగా కొందరు తప్పా అందరూ అదే బాపతు అనే నిజం సమాజంలో అందరికీ తెలిసిందే. అయినా ఎవరూ తమకేమీ తెలియదన్నట్టుగా నడుచుకుంటూ ఎవరి పనిని వారు గుట్టు చప్పుడు కాకుండా చేయించుకోవడం కొసమెరుపు.

ఛీకొడుతున్న సామాన్యులు..
ప్రభుత్వ కార్యాలయాల్లో పనికో రేటు ఫిక్స్ చేస్తే బాగుంటుందనే వెటకారాలు మొదలయ్యాయంటే సామాన్యులు ఎంతగా విసిగిపోతున్నారో తెలిసిపోతోంది. బోర్డులపై ఈ పనిని ఇన్ని రోజుల్లో చేస్తామని రాసిపెట్టినట్టే, ఈ పనికి ఇంతింత ఇచ్చుకోవాల్సి ఉంటుందని రాస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కార్యాలయాల చుట్టూ పనుల కోసం వచ్చి చెట్లకింద నిరీక్షించే వారిని కదిపితే తెలుసిపోతుంది. ఆఫీసుల దగ్గర పడిగాపులు పడిన వారిలోని నిర్వేదనను గమనిస్తే ప్రభుత్వోగ్యోగుల తీరు ఎంత దిగజారి పోయిందో అర్థం చేసుకోవచ్చు.

నొక్కడమే లక్ష్యంగా కొందరు ప్రభుత్వోద్యోగులు..
కొందరు ప్రభుత్వోద్యోగులు నొక్కడమే లక్ష్యంగా విధులకు వెళ్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. మరీ విచిత్రమైన విషయాలేంటంటే కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టి దానికి కావాల్సిన ఆర్థికావసరాలను లెక్కలేసుకుంటూ ఈ రోజు ఇంత గుంజాలి.. వచ్చే నెలలో ఎంత గుంజాలి అనే ప్రణాళికా రచనలు చేసుకునే మహా మేధావులున్నారంటే ఎంత పరాకాష్టకు చేరిందో తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో అయితే పిల్లల చదువులకు కావాల్సినవి కూడా లంచంగా గుంచి చెల్లింపులు చేస్తున్నారంటే పేట్రేగిన విధానం అత్యంత హేయం.

వారికే చెల్లు..
సర్కార్ కొలువుల్లో పర్యవేక్షణ ఆశించిన స్థాయిలో లేదనే విమర్శ ఉంది. పైస్థాయి అధికారులు కాస్త దృష్టి సారించే ప్రయత్నం చేస్తే రాజకీయ జోక్యం పెరగడం పరిపాటిగా మారింది. దీంతో మనకొచ్చిందిలే అనే ధోరణి కూడా కొందరు ఉన్నతాధికారులు అలవర్చుకున్నారు. ఏదైనా తేడా వస్తే వెంటనే సర్కార్ పై సమర శంఖం పూరించి, జీతంతో కూడిన సెలవు గడుపుతూనే తిరుగుబాట్లు చేసే మహాదవకాశం. ఇన్ని సౌకర్యాలు ఉన్నాక ఇక అంతకన్నా ఏం కావాలి. చేసే పనిని సవ్యంగా చేస్తేనే పైన చెప్పినవన్నీ అనుభవించే సౌకర్యాలు. కానీ అందులోనే అసలు కిటుకుంది. అవన్నీ ఒక్కెత్తు అయితే చేసే పనికి మరిన్ని ఆశించి బల్లకింద చేతులు పెట్టి నొక్కడం, పర్సంటేజీలు పొందడం.., గిఫ్ట్ రూపకంలో డిమాండ్ చేయడం కూడా వారికే చెల్లుతూ వస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments