వరదల్లో తండ్రికూతురు మిస్సింగ్
మరిపెడ మండలంలో ఆకేరు వాగు వద్ద ఘటన
నెక్కొండ మండలంలో కాజువేల మధ్య చిక్కుకున్న బస్సు
స్పాట్ వాయిస్, తొర్రూర్ :శనివారం రాత్రి నుంచి వర్షం విధ్వంసం సృష్టిస్తోంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, కాలువలపై గల వంతెనలు, లో లెవెల్ కాజ్ వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమయగూడెం శివారులోని ఆకేర్ వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఇద్దరూ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లి గంగారానికి చెందిన మోతిలాల్ ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్ బయలుదేరారు. అశ్విని సైంటిస్ట్. ఆమెతో కలిసి తండ్రి మోతిలాల్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.
వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
నెక్కొండ- మహబూబాబాద్ రహదారిలో వెంకటాపురం గ్రామం వద్ద రెండు లో లెవెల్ కాజ్ వేల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకపోయింది. వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాత్రి వెంకటాపురం వద్ద గ్రామం వద్ద చెరువు కింద ఉన్న పంట పొలాలకు నీరు వెళ్లే లో లెవెల్ కాజ్ వే దాటి ముందుకు వెళ్లింది. సమీపంలో ఎదురుగా ఇదే చెరువు అలుగు నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ కాజ్ వే దాటనీయకపోవడం వల్ల బస్సు మధ్యలోనే ఆగిపోయింది. వెనక్కి తిరిగి వద్దామంటే అప్పటికే పంట పొలాలకు నీరు వెళ్లే కాలువపై గల లో లెవెల్ కాజ్ వే మీదుగా ప్రవాహం పెరిగింది. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక రెండు కాజ్ వేల మధ్యలో రహదారిపైనే బస్సు నిలిచిపోయింది. ఈ రెండు కాజ్ వేల మధ్య రోడ్డు దాదాపు 200 మీటర్ల గ్యాప్ ఉంది. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. నెక్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో ప్రయాణికులను సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు.
Recent Comments