కొండంత బలగం ఉన్నా..
చితి పేర్చుకొని.. ఆత్మహుతి
ఓ తండ్రి ధీన కథ..
స్పాట్ వాయిస్, డెస్క్: చెప్పుకునేందుకు భారీ బలంగం. నలుగురు కొడుకులు.. కూతురు. కానీ తండ్రి మాత్రం తన చితిని తానే పేర్చుకొని ఆహుతి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, కూతురు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేశాడు. ఐదుగురికి పెళ్లిళ్లు చేశాడు. కొన్నేండ్ల క్రితమే వెంకటయ్య భార్య చనిపోయింది. ఈ నలుగురు కుమారులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నలుగురు కుమారుల్లో ఇద్దరు కుమారులు పొట్లపల్లిలో ఉంటుండగా.. ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో స్థిరపడ్డారు. వెంకటయ్య .. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కొడుకులకు సమానంగా పంచేశాడు. వెంకటయ్యకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. దీంతోనే ఖర్చులు వెళ్లతీసుకుంటూ.. పెద్దకొడుకు కనకయ్య ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే 5 నెలల క్రితం వెంకటయ్య పోషణపై కుమారుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో తండ్రి వెంకటయ్యను ఎవరు పోషించాలన్న దానిపై పొట్లపల్లిలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా తండ్రి వెంకటయ్యను పోషించాలని పెద్దమనుషులు నిర్ణయించారు. పొట్లపల్లి గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తికావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెంకటయ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సొంతూరిని, ఇంటిని వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకటయ్య మంగళవారం అదే గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన సమస్యను చెప్పుకున్నాడు. అదే రోజు రాత్రి ఆ నాయకుడి ఇంట్లోనే ఉన్నాడు.
చితి పేర్చుకుని…
బుధవారం పొద్దునే లేచిన వెంకటయ్య రెండో కుమారుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి పొట్లపల్లి నుంచి బయల్దేరాడు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వెంకటయ్యదేనని గుర్తించారు. తాటి కమ్మలను ఒక చోట కుప్పగా పేర్చుకుని వాటికి నిప్పంటించి, అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Recent Comments