గన్నీ సంచికి రూ. 30
అంగీకరించిన వ్యాపారులు
రేపటి నుంచి వరంగల్ మార్కెట్ ప్రారంభం
సంచుల నాణ్యత, ధరపై కమిటీ వేస్తున్నాం.
అన్ని మార్కెట్ల అధ్యయనం అనంతరం 26న నివేదిక
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్పాట్ వాయిస్, హన్మకొండ : రేపటి నుంచి వరంగల్ ఏనుమాముల ర్కెట్ ప్రారంభం అవుతుందని, అధ్వాన్న గోనె సంచులు, యూరియా బస్తాలు తప్ప మిగిలిన అన్ని సంచుల కోసం రైతులకు రూ. 30 చెల్లించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గన్నీ బ్యాగుల అంశంపై హన్మకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో రైతు సంఘాల నాయకులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సంయుక్త సమావేశం నిర్వహించి, చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేపటి నుంచి మార్కెట్ ప్రారంభించేందుకు వ్యాపారస్తులు అంగీకరించారని తెలిపారు. అధ్వాన్న బస్తాలు, యూరియా బస్తాలు తప్ప మిగిలిన గన్నీ సంచికి రూ. 30 చెల్లించేందుకు అంగీకరించారన్నారు. అయితే రైతులు కూడా వీలైనంత వరకు మంచి బ్యాగులు వినియోగించాలని కోరారు. మిగతా మార్కెట్లలో గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని, 26వ తేదీలోపు నివేదిక ఇస్తారన్నారు. అనంతరం మరోసారి సమావేశం ఏర్పాటు చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. రైతాంగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ అమలు చేస్తోందని, దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా లేవన్నారు. వరంగల్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ సౌండ్ గన్నీ బ్యాగ్ కు రూ. 30 ఇవ్వాలనేది 2017 నుంచి అమలులో ఉందన్నారు. రెండోసారి ఉపయోగించే గన్నీ బ్యాగ్ కి మాత్రమే డబ్బులు ఇవ్వమని చెప్తామన్నారు. రైతుల విషయంలో వ్యాపారస్తులు సానుకూలంగా ఉండాలన్నారు. సౌండ్ గన్నీ ధర పెంచేందుకు కమిటీ వేసి ముఖ్య మార్కెట్లలో అధ్యయనం చేసి నిర్ణయం చేద్దామన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, మార్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు, వ్యాపారస్తులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Recent Comments