ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకం
ఎస్పీ పుల్లా కరుణాకర్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్ : ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర కీలకమని, ఎన్నికల నియమావళిపై అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలపై ఎస్పీ ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో, పర్యవేక్షణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతీ అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేయాలని, ఇంతకు ముందు ఎలక్షన్ల సమయంలో సమస్యలను సృష్టించిన వారిపై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను, మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి దృష్టిసారించాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఎ.రాములు, కాటారం డీఎస్పీ జి.రామ్మోహన్ రెడ్డి తోపాటు జిల్లా పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments