స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 3రోజులు కోడిగుడ్డు, మరో 3రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు సూచనలు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జూలై ఒకటి నుంచి రాష్ట్రంలోని 28,606 పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అందజేయాలని సూచించారు. ఈ నెల 20న ఒక్కో జిల్లాల్లో 5వేల మంది విద్యార్థులకు రాగిజావను అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాగిజావ, బెల్లం పౌడర్లను వేర్వేరుగా జిల్లాలకు చేరుస్తామని, జిల్లాల నుంచి పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోలను ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగిపౌడర్, 10 గ్రాముల బెల్లం చొప్పున వారంలో మూడు రోజుల పాటు రాగిజావను అందజేయనున్నారు. కోడిగుడ్లను అందజేసే రోజులను మినహాయించి రాగిజావను పంపిణీ చేస్తారు. ఈ జావను మధ్యాహ్న భోజన కుక్ కమ్ హెల్పర్ల చేత తయారు చేయించనున్నారు.
Recent Comments