కనిపించేదంతా నిజం కాదు., కనబడనంత మాత్రాన అబద్ధమూ కావాలని లేదు. పొరలు కప్పబడిన నిజ స్వరూపాలు ఎవరి చూపును బట్టి వారికి దర్శనమిస్తుంటాయి. కంటిని మోసం చేయకుండా, అన్నింటినీ అర్థం చేసుకుంటేనే అసలు విషయం గోచరిస్తుంది. సమయానుకూలంగా సమస్తాన్ని గమనించి, సత్యాన్ని గ్రహించినవాడు విజేత అవుతాడు.., కళ్లముందు కనిపిస్తున్నదే వాస్తవం అని, కప్పబడిన స్వరూపాన్ని గుర్తించని వాడు అవకాశాల్ని కోల్పోతూనే ఉంటాడు. సాధించడం అనేది కాలానుగుణంగా దక్కాలో లేదో అని తెలిసిపోతుంది.., కానీ సమయాన్ని అంచనా వేసి ప్రయాణాన్ని సాగించడం మాత్రం నిరంతర ప్రక్రియలోనే తేలిపోతుంది. దైవనిర్ణయమో.., స్వయంకృతమోగానీ.., చేజేతులా చేతల్లోనే అన్నీ అవగతమవుతాయి.
గదిలో విభిన్న స్వభావాలు గల వ్యక్తులు పోగయ్యారు. ఒకే కోవకు చెందిన ఒక్కో జట్టుగా కనిపిస్తారు. లోపలికి వెళ్లే వరకు బయట వారి అనుయాయులు ఆహాలు.. ఓహోలు.., జయ జయ ధ్వానాలు, జేజేలు. ఆ మాటకొస్తే ఆ ప్రాంతమంతా విపరీతమైన కోలాహలమే. తీరొక్క రంగుల జెండాలతో ఆనంద వాతావరణమే. అంతా లోపలికి వెళ్లాక అన్ని ద్వారాలు మూసుకుపోతాయి. వారి అనుచరఘనమంతా బయట ముచ్చట్లలో మునుగుతుంది. వీళ్లంతా చూస్తుండగా, వాళ్లంతా లోపలికి వెళ్లేటప్పుడు ఎంతో ఆప్యాయత. తలుపులు మూసుకున్న తర్వాత ఏం జరుగుతుందో కనిపించదు.. కాబట్టి, లోపల అంతా బాగానే జరుగుతుందని ఆవహించిన భ్రమ. ఇప్పుడే అసలు తంతు. ఎదుటోడితో చేయాల్సిన ఫైట్ వీళ్లలో వీళ్లే. ఏ రంగు మనుషులు ఆ రంగు వారితోనే తన్నుకోవడం.. బయటవాడేమో వేరే రంగోడితో జరుగుతున్న యుద్ధతంత్రమని బట్టలు చింపుకుంటుంటే, లోపల ఎవరి జెండాలు వారే చింపేసుకునే ఘర్షణ. డోర్లు తెరుచుకుంటాయి.., అంతా జెండాలు సవరించుకుంటారు.., ఎవరి దారిన వారు పోతారు.., కార్యకర్తలు మాత్రం బిత్తరపోతారు.
ప్రారంభించాలంటే ఒక స్థాయి ఉండాలి.., కొనసాగించాలంటే ఓ ధైర్యం కావాలి.., చేజిక్కుంచుకోవాలంటే ఓ తెగింపు ప్రదర్శన ఉండాలి. అంచనాలకు చిక్కకుండా, అసలు అంచనాలోనే లేని వారిని కూడా వదలకుండా తనేంటో చూపిన తెగువ ఓరుగల్లు సొంతం. అంతా అనుకున్నట్టుగా ఉంటే అందులో మజా ఏముందో అనుకుంటుందో ఏమోగానీ, ఎవ్వరూ అనుకోని ఆ మాటకొస్తే కనీసంగా ఊహకందని పాఠాలు నేర్పిన ఘనత దానిది.
వరంగల్ రాజకీయమంటే ఎప్పుడూ ఒక చరిత్రే. తరాలుగా చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. కాలరాసినా అదే.., తిరగదోడినా అదే., ఆ మాటకొస్తే తిరుగేలేని స్థాయిలో నిలుచోబెట్టినా అదే. స్థానభ్రంశం జరుగొచ్చేమోగానీ, స్థాయి ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. అది నిజాం కాలమా.., సీమాంధ్ర పాలనా.., అతిరథ మహారథులు సిగపట్లు పడినప్పుడా.., ఇప్పటి యువ రాజకీయ కెరటం ఉత్సాహంగా కదిలిన సమయమా.. ఏదైతేనేం దాని దారి దానిదే. మూడు ముక్కలాటే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. గులాబీ, కమలం, చేయి దేనిలో తరచి చూసినా అన్నింటా అది కామనే. సమరానికి సమయం ఉన్నా, సందర్భం వచ్చినప్పుడల్లా తన్నుకోవడం జరుగుతున్న తంతే. ఎప్పుడో వచ్చేది ప్రధాన రణ గీతికైతే.., ఇప్పుడు జరుగుతున్నది ‘ఉప’ కరణాల బాపతు.
ఓరుగల్లు నీడలో అంతా బాగానే ఉందనుకుంటున్నాయి అన్ని జెండాలు. కానీ, జెండాల నీడమాటున ఎన్నో అనుమానాలు మాటేసి ఉన్నాయి. గులాబీలో గుటగుట.., కాంగ్రెస్ లో కకావికలం.., కాషాయంలో గుబులు. ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నా.., ఇప్పుడు మాత్రం వారి అంతర్గాతాలు వీరికి.., వీరి కుమ్ములాటలు వారికి ఆయుధాలవుతున్నాయి. నేను నిలబడకపోయినా ఫర్వాలేదుగానీ వాడు మాత్రం నిలుచోవద్దు అనే సమీకరాణాలే అధికం. బల ప్రదర్శన బృందాలు బరితెగిస్తుండగా, పెద్దలు మాత్రం ఎక్కడ లేని కలవరింత తప్పడం లేదు.
పార్టీ గెలుపు కాదు ముఖ్యం.., ప్రజాసేవ అంతకన్నా కాదు. నాయకుడు నెగ్గాలి.., నాయకుడు మాత్రమే నెగ్గాలి. ఇది ఎప్పటిదో తెలియదు గానీ, ప్రస్తుతం రెచ్చిపోతున్న ట్రెండ్. నెగ్గాలంటే తగ్గాలనేది తప్పుకుంటున్నది.., తలపడాలనే ధోరణి విపరీతాలకు పోతోంది. జెండాలు గుర్తింపునకు మాత్రమేగానీ, స్వతంత్రాలే ప్రధానమనేదిగా నేతల ధోరణి మారింది. తమను తాము మలుచుకునేందుకు పార్టీని ఒక ఉలిగా మలుచుకుంటూ శిలలుగా మారేందుకు నేతలంతా యత్నిస్తున్నారు. గెలిపించే కార్యకర్తలు గేలి చేయబడుతున్నారు. నాయకుడినే నమ్మి, నరనరాన జీర్ణించుకుని నకనకలాడే కడుపులతో అనుసరిస్తున్నా, ఎప్పుడు వారు ఓడిపోతూనే ఉంటున్నారు.
మచ్చుకు కొన్ని పరిశీలిస్తే మానుకోటలో గులాబీ జిల్లా అధ్యక్షురాలికి, తాజా ప్రతినిధికి మధ్య అప్రకటిత యుద్ధం కనిపిస్తున్నదే. ఇక రెడ్యాకు ఉంటదా…, రాథోడ్ కు వరిస్తుందా అనేది మరో కోణం. ఉమ్మడి జిల్లాకే ప్రధాన నియోజకవర్గాలైన పశ్చిమ, తూర్పుల్లో అన్ని పార్టీల్లో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహుల్ సభ ఇంకా కానే లేదు.., ఏర్పాట్ల వేళలోనే ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. అటు నాయిని అంటున్నాడు…, ఇటు జంగా తలపడుతున్నాడు.. ఎవరి పావులు వారు కదుపుతూ బలాలు చూపుకుంటున్నారు. ఇక కమలంలో మరో తీరు. రావు గారికి దక్కేనా.., రాకేశుడు దూసుకెళ్లేనా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మరి ధర్మారావు పరిస్థితి ఏమీగాను అనేది మరో ప్రశ్న. పరకాల నాగుర్ల ‘చల్లా’ బడుతాడా అనే ప్రశ్న చక్కర్ల కొడుతూనే ఉంది.
పార్టీల సమర శంఖానికి కేరాఫ్ ఓరుగల్లు అవుతుంటే ఇప్పుడు మరింత వేడి రాజుకుంటోంది. ఏ పార్టీని చూసినా ఏమున్నది గర్వకారణం.., అన్ని పార్టీల్లోనూ అసంతృప్తులదే దారుణం.. అనేది సర్వసాధారణమైంది. ఎప్పుడు సమసిపోతుందో తెలియదు గానీ, ఎలా చక్కబడుతుందో అర్థం అవడం లేదుగానీ, అన్నింటికి ఆఖరిగా ‘అతడి’ చేతిలోనే అంతిమ నిర్ణయం ఆధారపడి ఉంటుందనేది కాదనలేని వాస్తవం.
-ఎడిటర్ చేలిక రాజేంద్రప్రసాద్
Recent Comments