పంటంతా పిట్టలు తింటున్నాయని బెదురు పెట్టడానికి కర్ర పాతుతాడు రైతు. ఉత్త కర్రకు పిట్టలెలా భయపడతాయని బెదురు కోసం ఓ వస్త్రాన్ని చుడుతాడు దానికి. రివ్వున గాలి వీస్తుంటే ఆ ఉధృతికి కర్రకు చుట్టిన గుడ్డ రెప రెపా కొట్టుకుంటుంది. తిండి గింజల కోసం వచ్చిన పక్షులను పంట చేను నుంచి వస్తున్న కొత్త శబ్దం కాస్త భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో పక్షులన్నీ చేళ్లో వాలకుండా కొద్ది దూరం వెళ్లి పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై కూర్చుంటాయి. గుంపులోని సీనియర్ పక్షి తీక్షణగా బెదురు గుడ్డ వంకే చూస్తుంది. కొద్ది సమయం తర్వాత దానికో విషయం అర్థమై నెమ్మదిగా ఎగురుతూ వెళ్లి గుడ్డ కట్టిన కర్రపైనే వాలుతుంది. అదేమీ చేయలేదని గమనించిన ఇతర పక్షుల గుంపు కూడా నెమ్మది నెమ్మదిగా పైరుపై వాలి పంటను మొత్తం లూటీ చేస్తుంది. నమ్మకంగా ఇంటికెళ్లిన రైతు తిరిగి వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. రైతుకు ఊతం కర్ర.., కర్రకు ధైర్యం క్లాత్. కర్ర, క్లాత్ రెండూ పక్షుల పంచన చేరి నిలువునా ముంచింది మాత్రం కర్షకుడినే.
అందరూ ఆయాసపడుతున్నది, ఆవేశాలకు పోతున్నది అన్నదాత కోసమే., నిద్రలో కలవరిస్తున్నది వారినే.., నిజంలో కలవరపడుతున్నదీ వారి బాగుకే.. ఎవరి ఆవేదనను పరిశీలించినా రైతన్న మంచికోసమే. మరి అంతా ఆయన గురించే పోరాడుతుంటే ఆయనెందుకు అంత దుర్భర స్థితికి నెట్టేయబడుతున్నాడు..? అందరి కడుపులు నింపుతున్న ఆయన కడుపెందుకు ఎండుతోంది..? ఎందుకు మండుతోంది..? దానం తప్ప ఏమీ తెలియని ఆయనెందుకు అడుక్కుంటున్నాడు.? అంతటి దౌర్భాగ్యాన్ని నీళ్లు పోసి పెంచుతున్నామా.., ఒకరిని చూసి ఒకరు ప్రేరేపితమై పంచుతున్నామా..? రంగులు మారుతున్న రాజకీయంలో బతుకులు మారని దైన్యాన్ని వెల్లదీస్తున్న అన్నదాతకు అచేతనం అంటగడుతున్న గొప్పతనం మనదే. ప్రతీ దానికి ఆధారపడడం తప్ప స్వతహాగా చేసుకోవడం మరిపిస్తున్నదీ మనమే.
అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నడుమ రైతన్నకే కష్టం. ప్రభుత్వాల మధ్య వ్యవహారం కొసరడమే పనిగా, కొనడమే అవకాశమా అన్నట్టుగా మారింది. ధాన్యం పండించాల్సిన రైతు పరిస్థితి ‘‘ పంట ఎందుకు ఎండలేదురా భగవంతుడా..’’ అని బాధపడే విధంగా మారింది. చెమట చిందించడం తప్ప మరేమీ తెలియని రైతు ఇప్పుడు సరుకు అమ్మడానికి కూడా రక్తం కక్కుకుంటున్నాడు. తెచ్చిన అప్పులు, తాకట్టు ఆభరణాలు, అమ్ముడుపోని ధాన్యపు రాశులు.. ఇవే ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఊపిరాగేలా ప్రేరేపిస్తున్నాయి.
ఆరుగాలం కష్టం చేయాల్సిన వ్యక్తి ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలపైనే గంపెడాశలు పెట్టుకునే దుస్థితికి చేరుకున్నాడు. ఎవరు కొంటామంటున్నారో.., ఎవరు కొనమంటున్నారో..? ఏమీ తెలియని అగమ్యగోచరంలో పడిపోయాడు. గ్రామం., పొలం.., మార్కెట్ తప్ప.. మరేమీ తెలియని అన్నదాత ఇప్పుడు ఢిల్లీ ఫిగర్ అయ్యాడు. అలా అని ఆయనకేదో అక్కడ పెద్దపీట వేసి కూర్చోబెట్టినట్టు అనుకుంటే పొరపాటే. ఆయనను వాడుకున్నోళ్లకు, వాడుకున్నంత. ఆ మాటకొస్తే జీవం ఉన్న ఓ వస్తువుగా మారాడు అన్నదాత.
పాలకుల చేతలు, మాటలు మారినంత తేలిగ్గా మారడం అన్నదాతకు మింగుడు పడడం లేదు. వాళ్లు రాత్రికి రాత్రి నిర్ణయం ప్రకటించినంత ఈజీగా రైతు ఓ పంటను తీసేసి మరో పంట వేయలేడు కదా..? కాలంతో పాటు పరుగు తీయాల్సిన హలధారుడు, పోయిన కాలాన్ని తిరిగి ఎలా తీసుకురాగలడు. చేసేదేమీ లేక లాభాల మాట దేవుడెరుగు.., నష్టాన్ని మూటగట్టకండని వేడుకుంటూ వంగిపోతున్నాడు.
అన్యాయాన్ని నిలదీస్తాం.. అంటూ ఆవేకావేశాలతో నాయకులు చేస్తున్నదంతా అందరివాళ్లం అనిపించుకోవడానికే అయినా, తిరిగి చూస్తే వాళ్లంతా కొందరి వాళ్లే అనే నిజం తెలియడానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైతన్న భారాన్ని దించాల్సిన వారు గుదిబండగా మారుతూ.., ధైర్యాన్ని నూరిపోయాల్సిన వారు పిరికి చర్యలను ప్రేరేపిస్తున్నారు. మార్కెట్ లో జరగాల్సిన ధాన్యం క్రయవిక్రయాల వ్యవహారం ఇటు రాష్ట్ర రాజధాని రోడ్లు.., అటు దేశ రాజధాని వీధులపై చేర్చారు. సరే వారికి.. వారికి సవాలక్ష కానివ్వని గాక, చివరకు సీఎం కేసీఆరే మొత్తం ధాన్యం మేమే కొంటామని ప్రకటించడంతో అన్నదాత హ్యాపీ. కానీ, అది నవ్వుతూ ఏడ్వాల్సిన దుస్థితి. సాగు వద్దన్నారు కదా అని మదనపడుతూ, తనతోటి వారి దిగుబడికి ఢోకాలేదనే తృప్తితో మనసు కుదుటపరుచుకునే విచిత్ర స్థితి రైతుది.
రైతులకు రాజకీయాలను ముడిపెట్టడమే దౌర్భాగ్యం. ఉద్దేశం మంచిదే అయినా విమర్శలు వస్తున్నాయంటే దాని వెనక ఉన్న లోపాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి చేస్తున్నా మోకాళ్లడ్డుతున్నారంటే మర్మమేంటో గమనించాలి. విచిత్రమేమంటే ‘‘ముందు నిన్ను చక్కదిద్దుకో., తర్వాత పక్కోడి ప్రస్తావన గుర్తెరుగు’’ అనేది ఇప్పుడు అన్ని పార్టీలకు విపరీత ధోరణిగా మారింది. అదేమంటే ఎవరికి వారుగా సోదాహరణే చెబుతున్నారు. ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల మంది అన్నదాతలు బలవన్మరణాలు పొందారు వారి సంగతి చూడమని కాషాయం ఉటంకిస్తుండగా, ఇక్కడ చక్కదిద్దనాయన ఢిల్లీ వెళ్లి ఉద్దరిస్తడంటా.. అని హస్తం వారు వ్యంగ్యం విసురుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇప్పుడు లఖీంపూర్ ఖీరీకి వెళ్తాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్కడి రైతులు కూడా రైతులే కాదనం.., కానీ, కేవలం బీజేపీ సర్కార్ ఉన్నదనే ఆవేశంలో వెళ్తున్నారని వారు పేర్కొనడంలో కూడా అర్థముంది. మాకు మాదిరిగా కమలం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు రైతులకు సర్వీస్ చేయలేకపోతున్నారని గులాబీ దళం నిలదీయడమూ సబబే. ఇరువురు వారి స్వప్రయోజనలే చూసుకుంటున్నారా.., నిజంగానే అన్నదాతను ఆదుకోవడానికి పోటీపడుతున్నారా తెలియదు గానీ, ఇలా పార్టీల మధ్య ఆధిపత్యంలో అన్నదాత బలవుతూనే ఉన్నాడు.
పంట పండించమే పాపమా.., సాగు చేయడమే శాపమా.. అని అన్నదాత కుటుంబాలు నిలదీస్తున్నాయంటే ఎద్దేడుస్తున్న ఎవుసమే సాగువుతోందని తెలుస్తున్నదే. ప్రజలకే పని చేయాల్సిన వారు పంథాలకు పోతే.., బాగోగులు చూడాల్సిన వారు బరితెగిస్తే గోడు వినేదెవ్వరో తెలియడం లేదు. నాయకుల యాత్రలు సంగ్రామంగా మారుస్తాయో.., సంతాపమే అవుతాయో, లేదంటే పార్టీల సానుభూతికే పనికొస్తాయోగానీ అన్నదాత కంటనీరును తుడిచేందుకు మాత్రం ప్రయత్నం జరగాలి. కాపలా కాయాల్సిన బెదురు గుడ్డ, భయంకరంగా నిలవాల్సిన దిష్టి కర్ర పిట్టలకు చేదోడుగా నిలిస్తే.., తనవారే అనుకున్న రైతన్న కష్టం ఎవరికి పడుతుంది. పంటనే కాపాడుకోలేక ముందకెళా సాగుతాడు..? ఏదిఏమైనా ఇటు రాష్ట్రం, అటు కేంద్రం రెండూ దేనికవే. కానీ, రెంటి నడుమ నలుగకుండా అన్నదాతను కాపాడుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలు గుర్తెరగాల్సిందే.
-రాజేంద్ర ప్రసాద్ చేలిక, ఎడిటర్
Recent Comments