Monday, November 25, 2024
Homeటాప్ స్టోరీస్భయమా...! జాగ్రత్త...?

భయమా…! జాగ్రత్త…?

భయమా…! జాగ్రత్త…?
కార్పొరేటర్లతో తూర్పు ఎమ్మెల్యే సమాలోచనలు..
క్యాడర్ ను కాపాడుకునేందుకు తిప్పలు..
హద్దులు మీరితే వేటు తప్పదని హెచ్చరిక..
ఎక్కడికి వెళ్లొద్దని ‘కట్టు’దిట్టం..

స్పాట్ వాయిస్, వరంగల్: అందరు ఉన్నా ఒంటరి బాపుతు అనుభవాన్ని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. స్వయంకృతమో.., పెద్దలున్నారన్న ఓవర్ లుక్కోగానీ నియోజకవర్గంలోని ఏ కారు నేత కూడా ఆయనతో సఖ్యతగా ఉన్న దాఖలాలు భూతద్ధం పెట్టుకుని వెతికినా కనిపించదు. గెలుపుపై ధీమా ఉండొచ్చుగానీ, మరీ ఇంత ఒంటెత్తు పోకడలకు పోతే పరిస్థితులు తలకిందలవడం ఖాయమని స్థానికులు పేర్కొంటున్నారు. కలుపుకుని పోతే బలం పెరుగుతుందిగానీ, గెలుక్కుంటూపోతూ బలహీనపడడం ఆయనకే చెల్లుతుందని స్థానిక నాయకులు ముఖం మీదనే అంటున్నారు.

కార్పొరేటర్లతో సమాలోచనలు..
మేయర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన నన్నపునేని స్థానికంగా వరంగల్ లోని అందరు లీడర్లకు సుపరిచితుడే. అందరికీ దగ్గరివాడే. ముఖ్యంగా తన స్థాయికి తగ్గట్టుగా కార్పొరేటర్లను గెలిపించుకోవడంలో కూడా కృతకృత్యుడయ్యాడు. కానీ, మేయర్ కు ఆయనకు అస్సలే పొసగడం లేదు. మేయర్ సుధారాణి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో ఉండబోతుందనే ఒక వర్గం ప్రచారం ఆయనకు మింగుడుపడడం లేదు. అధిష్టానం ఏం అనుకుంటుందో ఇంకా ఏ మాత్రం స్పష్టత లేకున్నా గాలివాటంగా వస్తున్న ప్రచారానికే ఇంకా వారిమధ్య అంతరం పెరుగుతూనే ఉంది. దీంతో ఆయన తన ఆస్త్రాలను సంధిస్తున్నాడనే వాదన వినిపిస్తున్నది. అదే తన వర్గం కార్పొరేటర్లను మేయర్ కు సహకరించకుండా అడ్డుకట్టవేస్తున్నాడనేది. అందులో భాగంగా కొద్ది రోజుల కిందట తూర్పులోని కారు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే రహస్య సమావేశం నిర్వహించారు. అందరికి పేరుపేరునా హెచ్చరికతో కూడిన భవిష్యత్ ను ప్రబోధించారు.

భయమా.. జాగ్రత్త..
‘తూర్పు’న వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన చరిత్ర నియోజకవర్గం ఏర్పడిన నుంచి లేదు. దీంతో ఈ విడత తనకు ఏం జరుగబోతుందోనని అనుమానాలు ఆయనను కూడా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోపల ఆయనున్న సంశయాలు ఆయనను వేధిస్తున్నట్టు సమాచారం. అసలే దూకుడు వ్యవహారం.. ఎవరిని కలుపుకుని పోని అతి తనం., పైన ప్రసన్నం చేసుకోవడానికి ఉన్నారన్న నమ్మకం. అన్నీ కలిసి ఆయనను అందరికీ దూరం చేశాయి. దీంతో ఇన్నాళ్లు ఏమీ ఎరగనట్టుగా వ్యవహరించి ఉండి ఉంటాడుగానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆలోచనలో పడ్డట్టు అనిపిస్తోంది. అందుకే బలాన్ని దూరం చేసుకోకుండా కార్పొరేటర్లను కట్టడి చేసుకుని ధైర్యాన్ని ప్రోదిచేసుకుంటున్నాడు.

హద్దు మీరొద్దు
తోకజాడిస్తే కట్ చేయాల్సిన అఘాయిత్యం తప్పకుండా ఉంటుందని నన్నపునేని కార్పొరేటర్లను హెచ్చరించారు. అందరం కలిసి పనులు చేస్తూ ప్రజల్లో బలంగా ఉండాలని, ఏదైనా అవసరం వస్తే తనను ఆశ్రయించి పరిష్కారాన్ని కనుక్కోవాలి తప్ప పారిపోవడాలు చేయొద్దని చెప్పినట్టు తెలుస్తోంది. అక్కర తీరిందని పక్క చూపులకు వెళ్తే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. ఎవరు ఎంత దూరం వెళ్లినా అంతా ఇక్కడే ఉంటామని, తెల్లారి లేస్తే అంతా ఇక్కడికిక్కడే చూస్తూ గడుపుతామని ఆ విషయాన్ని గుర్తెరిగి మసులుకోవాలని స్మూత్ గా వార్నింగ్ ఇచ్చారు.

ఏదిఏమైనా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా తూర్పులో ఎలక్షన్ వాతావరణం వేడెక్కింది. అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం తడిసిపోయే గడ్డు స్థితి. నన్నపునేని ముందుగానే జాగ్రత్తపడుతున్నా వ్యూహాలు బెడిసి కొట్టకుండా, స్వపక్షంలోనే విపక్షాన్ని బుజ్జగించుకుంటే రికార్డు తిరగరాసినోడే అవుతాడు. అలా కాదని ఎంత ముందుస్తుగా ఆలోచించినా సొంతవారిని దూరం చేసుకుంటే జరగాల్సిన నష్టాన్ని కొనితెచ్చుకున్న వాడే అవుతాడు. చూడాలి మరి…

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments