విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలి
జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి ఒంటేరు చంద్రశేఖర్
ఎస్ఏ-1 పరీక్షా కేంద్రాల తనిఖీ
స్పాట్ వాయిస్, గణపురం: విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని, ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి ఒంటేరు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం మండలంలో జరుగుతున్న అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూర్బా పాఠశాల లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని, ఉపాధ్యాయులు బోధించిన ప్రతీ అంశాన్ని శ్రద్ధగా అర్థం చేసుకుని ప్రశాంతగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ నెల 28 తేదీ వరకు జరగనున్న పరీక్షల జవాబు పత్రాల ఉపాధ్యాయులు నవంబర్ 2న మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని, అదేవిధంగా నవంబర్ 5న మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నవంబర్ 16న తల్లిదండ్రులతో టీచర్లు సమావేశం నిర్వహించి విద్యార్థుల మార్కుల ఆధారంగా వారి ప్రతిభను చర్చించి ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీసీఈబీ సహాయ కార్యదర్శి శనిగరపు భద్రయ్య, ఎంఈవో ఊరుగొండ ఉప్పలయ్య తదితరులు ఉన్నారు.
Recent Comments