యువతి మృతి కి కారణమైన యువకుల అరెస్టు..
స్పాట్ వాయిస్ , దామెర: మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన యువతిని వేధించి మృతికి కారణమైన యువకులను బుధవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పరకాల ఎసిపి జూపల్లి శివరామయ్య తెలిపారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఎసిపి జూపల్లి శివరామయ్య మాట్లాడుతూ మండలంలోని ల్యాదేళ్ల గ్రామానికి చెందిన సంగాల సాయి తో సదురు యువతి చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియో లు తీశాడు. వాటిని ఆ యువతి డిలీట్ చేయమని కోరగా, సాయి తీసేస్తానని నమ్మించి , వీడియో, ఫొటోను తన స్నేహితుడైన ఇదే గ్రామానికి చెందిన తాళ్ళ ప్రణయ @ఢిల్లీకి పంపించాడు. అతడు ఆ యువతిని లైంగికంగా వేధిస్తూ తాను చెప్పినట్టు చేయక పోతే ఫోటో వీడియో ను అందరికీ పంపిస్తానంటూ బెదిరించడంతో ఆ యువతి మనస్తాపానికి గురై ఈనెల 18న ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించారు. 21 వ తేదీన రాత్రి యువతి ఫిర్యాదు చేయగా ఎస్సై హరిప్రియ కేసు నమోదు చేశారు. పరకాల రూరల్ సీఐ బి. శ్రీనివాస రావు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 22 వ తేదీ రాత్రి యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో యువతిని లైంగికంగా వేధించిన తాళ్ళ ప్రణయ్ (ఢిల్లీ), అతనికి ఫొటోలు, వీడియో లు పంపించిన సంగాల సాయి లు పరార్ అయ్యారు. సీఐ శ్రీనివాస వారిని బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పరకాల రూరల్ సీఐ శ్రీనివాస రావు ,దామెర ఎస్పై హరిప్రియ, శాయంపేట ఎస్సై. వీరభద్ర రావును పరకాల ఏసీపీ శివరామయ్య అభినందించారు.
Recent Comments