వదల బావా.. వదలా..?!
హన్మకొండ డీఎంహెచ్ లో బామ్మర్దిదే ఫైనల్..
‘అన్నీసెట్’ చేసేది ఆయనే..
అంతకంతకూ శృతిమించుతున్న ఆగడాలు..
అడ్డెవరంటూ ఫోజులు..
ఏ ఉద్యోగి నోట విన్నా ముద్దుల బావమరిది ముచ్చటే…
బావబామ్మర్దుల బంధం అది. అలా అని బంధువులే అనుకుంటే పొరపాటే., కేవలం వృత్తి కలిపిన బంధమే. అలా అని ఇద్దరూ సమాన ఉద్యోగులూ అనుకుంటే ఈ సారి మరోమారు పప్పులో కాలేసినట్టే. బావేమో బాస్ అయితే.. బామ్మర్ది ఎక్కడో పీహెచ్ సీలో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగి. కానీ, వారిని ఏ బంధమో బలంగా కలిపింది. ఆ మాటకొస్తే భారతంలో కృష్ణార్జునులు కూడా కాస్త డిస్టెన్స్ మెయింటెన్ చేసి ఉండి ఉంటారేమోగానీ, వీళ్లది మాత్రం విడదీయలేని బంధం. అక్కడ గోపాలుడు సారథిగా నడిపిస్తుంటే అర్జునుడు తంత్రం నెరిపినట్టు, ఇక్కడా అర్జునుడు బావను బూచీగా చూపి ‘అన్నీసెట్’ చేసుకు వెళ్తున్నాడు. ఇన్ని జరుగుతున్నా బావగారేమో చూసీ చూడనట్టుగానే ఉంటారు. ‘‘ఆ ఇద్దరి అనుబంధాన్ని ఫెవీకాల్ కంపెనీ వారు పబ్లిసిటీకి పర్యాయంగా వాడుకొని ఉండాల్సింది కానీ, పాపం వీళ్ల మైత్రి బంధం వారి వరకు వెళ్లనట్టుంది..’’ అని డిపార్ట్ మెంట్ లోని ఉద్యోగులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
– స్పాట్ వాయిస్, ఓరుగల్లు
హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో బామ్మర్ది చెప్పిందే ఫైనల్. కంటి చూపుతోనే పనులన్నీ చక్కబెట్టేంత గొప్ప నేర్పరి. అందునా ఆర్థిక లావాదేవీల్లో అయితే అతగాడిదే పైచేయి. ఆయనకున్న సోర్స్ అంతా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, నర్సింగ్ కళాశాలలే. వాటినే అవసరమున్నప్పుడల్లా ‘పొదుపు’గా వాడుకుంటాడు. ఏ చిన్న సందు దొరికిన ‘సార్’ పేరు చెప్పి దండుకోవడమే మహాదండిగా తెలిసిన నేర్పరి అతడు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి అతనో నీడలా.., ఎప్పుడూ వెంటే ఉండే ధైర్యం ఆయన. ఈయనగారు చెప్తేగానే సారు కారు దిగే పరిస్థితి ఉండదంటే అతిశయోక్తి కాదేమో., అంతటి గట్టిది వీరి బంధం. వీరి మధ్య వ్యవహారంపై చాలా ఆరోపణలు వచ్చినా ‘ఆ బంధం’ మాత్రం వీడడం లేదు.
విధుల్లో కనిపించేది అరుదే..
ఆ బామ్మర్ది గారు ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉద్యోగి. కానీ ఏనాడు అటు వైపుగా కన్నెత్తి చూసింది లేదు. పైనున్న బావే తనవాడైతే తనను అనేదెవరు..? అనే మాదిరిగా చెలరేగిపోతుంటాడు. అవసరాలకు వాడుకుంటూ, పేరు చెప్పుకుని పోగేసుకునే అతగాడు సారును జిల్లాలు దాటించడంలో సిద్ధహస్తుడే. గతంలో ఓ మారు మేడారంలో జరిగిన ఓ ప్రైవేట్ దావత్ కూ ఇద్దరు కలిసే వెళ్లారు. అందునా కార్యాలయ పనివేళ్లల్లోనే వెళ్లారంటే వారి మైత్రి బంధం ఎంతటి గట్టితో తెలిసిపోతుంది. నిబంధన ప్రకారం అయితే జిల్లా అధికారులు సరిహద్దులు దాటి వెళ్లాలంటే కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, వీరికి అవేమీ పట్టింపులు లేవు అనేది డిపార్ట్ మెంట్ లో పనిచేసే ప్రతీ ఒక్కరికి తెలిసిందే.
‘అన్నీసెట్’ చేస్తాడు..
ఈ అనిశెట్టిగారు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో, నర్సింగ్ కళాశాలలో సార్ పేరు చెప్పి సంపాదించడంలో ఘనాపాటి. ఆ మధ్య ఎల్కతుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని ఎలుక కొరుకగా, పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా, ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది జరిగిన విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకేం పెద్ద సార్ అనుగ్రహం ఉన్న ఈ ‘అన్నీ శెట్’ గారు మరుసటి రోజే అక్కడ ప్రత్యక్షమై హల్చల్ చేశారు. యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకున్నాడు. ఆయన ఘనకార్యాలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.., కాస్త ఫోకస్ పెడితే బోలెడన్ని బయటపడుతాయి. ఇదొక్కటనే కాదు ఏ విషయంలోనైనా వేలుపెడుతూ చక్రం తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు గోడు వెల్లబోసుకుంటున్నారు. సంపాదనే ధ్యేయంగా పని చేస్తూ విధులను పాతర పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మాటకొస్తే హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొన్ని రోజులుగా ఈ తథంగా సర్వసాధారణం అయిపోయిందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
కలెక్టర్ చొరవ చూపాలని వినతి..
క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు వారి బాస్ లతో ఉన్న చెలిమిని అవకాశంగా వాడుకుంటూ విధులకు డుమ్మాకొట్టే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సొంత శాఖలోని ఉద్యోగులే వేడుకుంటున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని, గతి తప్పిన ‘కార్యాలయాన్ని’ గాడిలో పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏసీబీ నజర్..?
సదరు పీహెచ్ సీ ఉద్యోగి అక్రమాస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం. అంత చిన్న ఎంప్లాయ్ కు ఇన్ని ఇన్ కమ్ సోర్సులు ఎక్కడ నుంచి వచ్చాయి.., ఏమేం చేస్తున్నాడనే విషయమై కూపీ లాగుతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖలోని పలువురు ఉద్యోగులే ఈ విషయమై సదరు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వినికిడి. ఏది ఏమైనా సదరు బావబామ్మర్దుల సరసం, సంపాదనపై నిజానిజాలు కాలమే తేల్చాలి.
Recent Comments