Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్ఏం బతుకుల్రా బాబూ..!

ఏం బతుకుల్రా బాబూ..!

దీనమ్మా.. జీవితం..
ఏం బతుకుల్రా బాబూ..!

మునుగోడులో స్థానికేతర టీఆర్ఎస్ నేతల నైరాశ్యం..
ఇంతింత ఖర్చులు అవసరమా..? అని ఆవేదన
కుటుంబాలకు దూరంగా ఉండడంపై మనోవేదన..
ఉప ఎన్నిక తమ సావుకొచ్చిందని గోడు..
మళ్ల టిక్కెట్ ఇయ్యకున్నా మంచిదే పో.. అనే తెగింపు

స్పాట్ వాయిస్, బ్యూరో : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా మునుగోడు ఉపఎన్నిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సావుకొచ్చిపడింది. ఫలితం ఎలా ఉండబోతున్నా అది ముమ్మాటికీ వారి మెడకు చుట్టుకోనుంది. ఆ మాటకొస్తే వీళ్లెవరికీ ఆ నియోజకవర్గంతో సంబంధం లేదు.., అక్కడి ప్రజలకు వీళ్లవి అంతగా తెలిసిన ముఖాలూ కాదు.., భవిష్యత్ లో ఆ నియోజకవర్గంలో బరిలో ఉండే అవకాశాలు అంతకన్నా లేవు., గానీ ఇప్పుడు ఆ మహా మహా నేతలంతా కేరాఫ్ మునుగోడుగా తిరుగుతూనే ఉన్నారు. పైకి చూడడానికి ప్రచారాలు చేస్తున్నా, లోలోపల మాత్రం తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. నవంబర్ ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా.., ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి జారుకుందామా.. అనే ఆతృతతో కాలం వెల్లదీస్తున్నారు.

ఏం బతుకుల్రా బాబూ..!
రాష్ట్రం యావత్తూ ఇప్పుడు మునుగోడులోనే కేంద్రీకృతమైంది. దాదాపు అందరు ప్రజాప్రతినిధులు అక్కడే తిరుగుతున్నారు. వారి వెంట వందల సంఖ్యలో అనుచర గణం కూడా ఉంటోంది. అసలే ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. రాత్రి అయితే చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో వాళ్లందరికీ షెల్టర్లు కల్పించడం, బాగోగులు చూసుకోవడం వెంట తీసుకెళ్లిన ప్రజాప్రతినిధే బాధ్యత తీసుకోవాల్సి రావడంతో తలప్రాణం తోకకొచ్చినంత పనవుతోంది. తమకే టికానా లేదు,, వీళ్లందరికి ఎక్కడ నుంచి తేవాల్రా దేవుడా.. అని ఓ నాయకుడు ఆవేదన వెల్లగక్కడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ‘‘అసలు మేము ఇక్కడేం చేస్తున్నామో.., ఎందుకొచ్చామో కూడా అర్థం కావడం లేదు.., మావి ఏం బతుకులో తెలియడం లేదని..’ మరో గులాబీ ప్రతినిధి ఆక్రోశం వెల్లబుచ్చాడు.

ఏం ఖర్చుల్రా నాయనా..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు పార్టీ అధిష్టానం మునుగోడు ఉపఎన్నికల్లో ఇన్ చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. వారికి కేటాయించిన యూనిట్లలో నిరంతరం తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ పార్టీకి బలం చేకూర్చడం, నవంబర్ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టేలా వారిని మలచడం ఇన్ చార్జీల పని. దీనికి సదరు ఇన్ చార్జీలు స్వీకరించిన నేతలు పెద్ద కసరత్తే చేస్తున్నారు. రోజూ కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను వెంటేసుకుని గడపగడపకూ తిరుగుతున్నారు. పేరుపేరునా ఓటర్లను పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా సదరు ‘బెటాలియన్’ కు సంబంధించి ఉదయం లేచి టీ తాగడం, టిఫిన్ చేయడం నుంచి మొదలు మధ్యాహ్నం భోజనాలు, మళ్లీ రాత్రికి మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అన్నీ అయ్యాక సేద తీరడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఇన్ చార్జిలకు తలకుమించిన భారంగా మారుతోంది. కనీసంగా ఒక్కో నేత తన అనుయాయులను పోషించుకోవడానికి రోజుకు సుమారు లక్ష రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఇంతింత ఖర్చులు పెట్టుకుని తాము సాధించేది ఏంటో తమకే అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు. ఈ ఖర్చేదో తనను గెలిపించిన నియోజకవర్గంలో పెట్టుకున్నా ప్రజలు చిరకాలం గుర్తుంచుకుని మరీ గెలిపించుకుంటారని మదనపడుతున్నారు.
ఇదీ చాలదన్నట్టుగా ఇంకా ఎవరైనా ఏ గ్రామం నుంచైనా సర్పంచో, ఎంపీటీసో టీఆర్ ఎస్ పార్టీలోకి వస్తే అతడికి సెట్ చేయాల్సిన ‘లావాదేవీ’లు కూడా ఇన్ చార్జిలే భరించాలని పార్టీ పెద్దలు సూచిస్తుండడంతో మరింత లబోదిబో మంటున్నారు.

కుటుంబాలకు దూరంగా ఉండడంపై వేదన..
ఓ వైపు బతుకమ్మ, దసరా పండుగలు పోయాయి.., దీపావళి కూడా రేపోమాపో అయిపోబోతోంది. తెలంగాణ అంటేనే ఈ పెద్దపండుగలు. ఇవ్వన్నీ మునుగోడు ఎన్నికల పుణ్యాన అందరు నేతలు అంతగా జరుపుకున్న దాఖలాలు లేవు. కనీసం భార్యాపిల్లలతో కూడా ప్రశాంతంగా గడిపే సమయం కూడా లేకపోవడంతో టీఆర్ఎస్ నేతలంతా తీవ్రంగా మదన పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక తమ సావుకొచ్చిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

టిక్కెట్ ఇయ్యకున్నా మంచిదే పో.. అనే తెగింపు
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు రాబోతున్నాయి. ఇప్పుడు మునుగోడు ఫలితాలను అన్ని పార్టీలు సెమీ ఫైనల్స్ గా భావించి దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక టీఆర్ఎస్ అయితే గెలుపే లక్ష్యంగా దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలకు అవకాశం లేకుండా చొచ్చుకెళ్తుతోంది. ఇన్ చార్జీలంతా తమకు కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో తిష్ట వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటింగ్ సరళి, ప్రజల నాడీపై అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరా తీసే అవకాశాలుండడం, దాని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యేల్లో హైరానా ఎక్కువైంది. ఒకానొక దశలో ‘‘పెద్దాయన టిక్కెట్ ఇవ్వకున్నా మంచిదేపో.. ఎట్లయ్యేది అట్లైతది.. అని వారికి వారే ధైర్యం చెప్పుకుంటున్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. మొత్తంగా మునుగోడు ఎవరిని ముంచుతుందో.. ఎవరిని తేల్చుతుందో.. ఫలితాల తర్వాతే చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments