చంటిగాడు లోకల్…
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు..
దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు..
ఏవీ రంగనాథ్ పై ఫైర్..
చిలికి చిలికి గాలి వానగా వ్యవహారం..
స్పాట్ వాయిస్, హైదరాబాద్
‘అధికారులు వస్తుంటారు. పోతుంటారు. నేను లోకల్..’ అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం 69 నందగిరిహిల్స్ లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని కూల్చివేతకు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా దానం నాగేందర్ స్పందించారు. కొత్తగా ఏర్పాటైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. తనను ప్రహరీ తొలగించిన కేసులో A3గా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దానం నాగేందర్ హిమాయత్ నగర్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆయా సందర్భాల్లో మాట్లాడారు. ఒకానొక దశలో తనపై నమోదైన కేసుపై మాట్లాడుతూ అధికారులు వస్తుంటారు… పోతుంటారు., నేను లోకల్.. అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారంటారన్నారు. నందగిరిహిల్స్ హుడా లే ఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అక్కడి వెళ్లినట్లు వివరించారు. అక్కడ జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సమస్యలు తీర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పార్క్ వద్ద గోడను కూల్చివేశారనే ఆరోపణలపై దానంతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుతో కేసు..
ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్టు పాపయ్య అనే వ్యక్తి ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై భారతీయ శిక్షాస్మృతి (IPC), పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించే నిరోధక చట్టం (PDPP), వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు.
Recent Comments