సూర్యాపేట జిల్లా రాజానాయక్ తండాలో విషాదం
గొంతులో ఎముక ఇరికి వ్యక్తి మృతి
ముత్యాలమ్మ మొక్కులు సమర్పించి విందు చేసుకునే క్రమంలో ఘటన..
స్పాట్ వాయిస్, నల్లగొండ: పండుగపూట ఆ తండాలో చీకటి అలుముకుంది. ఇంటిళ్లి పాది కూర్చుని వేడుక చేసుకునే వేళ ఆ ఇంట్లో విషాదం నిండింది. సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్ తండాకు చెందిన భూక్య గోపి కుటుంబానికి ఇంటి దైవం ముత్యాలమ్మ. ఈనెల 12వ తేదీ మంగళవారం ముత్యాలమ్మ పండుగ చేశారు. అమ్మవారికి మేకను బలిచ్చి మొక్కులు చెల్లించి, యాట మాంసాన్ని రుచికరంగా వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. మసాలాల ఘుమఘుమలతో నాలుక ఊరిళ్లు పెట్టుతుండగా రుచిని ఆస్వాదించడానికి అంతా బంతి భోజనానికి కూర్చున్నారు. మాంసం ముక్కలు తింటుండగా గోపి గొంతులో మాంసం బొక్క ఇరుక్కుంది. ఇటు బయటకు రాక, అటు లోనికి వెళ్లకుండా అడ్డం పడింది. దీంతో అతడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని రకాల ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యులు శతథా యత్నించినా ఫలితం దక్కలేదు. చికిత్స జరుగుతుండగానే గోపి ఊపిరి ఆగింది. అంతవరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబమంతా ఒక్కసారిగా బోరుమన్నారు. పండుగపూట విషాదం నెలకొనడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాగా, గొంతులో బొక్క ఇరుక్కుని చనిపోయిన భూక్య గోపి అంత్యక్రియల తర్వాత ఆయన కుమారుడు భూక్య సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బొక్కిరికింది.. శ్వాస ఆగింది..
RELATED ARTICLES
Recent Comments