రేవంత్ రెడ్డిపై సీనియర్ల అలక
గ్రూపు రాజకీయాలకు తెర..
పోస్ట్ పోన్ అయిన ప్రమాణస్వీకారం
6వ తేదీన ఉండనున్నట్లు సమాచారం..!
తెలంగాణ కొత్త సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం రాత్రి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు రాజ్‌భవన్‌లో సైతం ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సీఎల్పీలో సీఎం ఎవరనేదానిపై నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. సీనియర్ నేతలతో డీకే శివకుమార్‌తో పాటు ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే అంశంపై నలుగురు సీనియర్లు అలకబూనినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు సీఎల్పీ సమావేశం నుంచి బయటికి వెళ్లినట్లు సమాచారం. దీంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత డీకే శివకుమార్‌తో పాటు నలుగురు ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో మంగళవారం ఉదయం సమావేశమై అభ్యర్థిని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తీరు ఇప్పుడు రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది.
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. అయతే పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డివైపే మొగ్గుచూపిందని, సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎంపికపై పార్టీలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లిపోయారు. ఆయనతో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఉన్నారు. వీరితో చర్చించిన అనంతరం .. సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిపై మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు కూడా తమకు ముఖ్యమంత్రి పీఠం కావాలని పట్టుపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఫైనల్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
సీనియర్ల అలక..
కాంగ్రెస్ సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మూడో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారా.. లాస్ట్ మినిట్‌లో అనూహ్యంగా వేరొకరు పేరు అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. మొత్తంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ తెలంగాణ సీఎంగా ఎవరు ఉండాలనేది ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.
సీఎంపై ఉత్కంఠ..
తెలంగాణ కొత్త సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ భేటీ జరిగింది. కొత్త సీఎం ఎంపికపై నేతలు చర్చించారు. అయితే సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పటికే చర్చించి రేవంత్ రెడ్డికి సీఎం బాధ్యతలను అప్పజెప్పాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడంపై పార్టీలో కొందరు సీనియర్లు అభ్యంతరం చెబుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే తనకు కూడా ఇప్పుడే మంత్రి పదవి ఇవ్వాలని సీనియర్ నాయకులు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఉదయం సీఎల్పీ భేటీ తర్వాత.. ఆయన ఎల్లా హోటల్ నుంచి వెళ్లిపోయానట్లు సమాచారం. ఇలా సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో.. హైకమాండ్ కూడా పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. సీఎంతో పాటే మంత్రులను కూడా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం అభ్యర్థి ప్రకటన ఆలస్యం
తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కానున్నట్లు తాజా పరిణామాలు చూస్తే తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడిచినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల కారణంగా ఈ నెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఏఐసీసీ పెద్దలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Recent Comments