హత్య చేసి పూడ్చిపెట్టారు..
బొందపెట్టిన చోట పిండివంటలు
భర్త, అత్తమామ, ఆడపడుచు దారుణం..
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ఘటన
స్పాట్ వాయిస్, మానుకోట: మహబూబాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. భర్త, అత్తమామ, ఆడపడుచూ.. హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టారు. అంతేగాదు శవాన్ని పూడ్చిన బొందపైనే కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసి పైశాచికాన్ని ప్రదర్శించారు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్ లోని సిగ్నల్ కాలనీలో జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిగ్నల్ తండాలోని భూపతి అంజయ్య ఇంటిలో కొన్ని నెలలుగా కాటి గోపి అతని భార్య నాగమణి, తల్లిదండ్రులు లక్ష్మి,రాములు, ఆడపడుచు దుర్గ, బావ మహేందర్ తో కలిసి ఉంటున్నాడు. గోపి-నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులతో పాటు యాచక వృత్తిలో ఉన్నారు. నాగమణిని కొన్ని నెలలుగా భర్త గోపి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలోనే భర్త గోపి తల్లిదండ్రులు, ఆడపడుచు, బావతో కలిసి భార్యను ఈనెల 13న హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య అనంతరం ఇంటి ఆవరణలోనే నాగమణి మృతదేహాన్ని బొందపెట్టి ఆ రాత్రే ఇంటి తాళం వేసి కుటుంబ సభ్యులంతా పరారయ్యారు. ఈనెల 13న ఇంటి నుంచి అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు ఇంటి యజమానికి భూపతి అంజయ్యకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అంజయ్య ఇంటి వద్దకు చేరుకుని పరిశీలిస్తుండగా గోతి తీసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులతో కలిసి పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కానిస్టేబుళ్లు, క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. నాగమణిని హత్య చేసి ఇంటి పక్కనే పూడ్చివేసి.. బొందపెట్టిన స్థలంలోనే పొయ్యి ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాగమణి హత్యకు కారణాలేంటి..? ఎన్ని రోజుల క్రితం హత్య జరిగిందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Recent Comments