కార్పొరేటర్ రాములు కుటుంబాన్ని ఆదుకుందాం..
-పార్టీలకతీతంగా సాయం చేద్దాం..
-గ్రేటర్ కార్పొరేటర్లంతా కలిసి రావాలని పిలుపు..
-63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీ – సయ్యద్ రజాలి
స్పాట్ వాయిస్, కాజీపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 61 వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లుగంటి రాములు మరణం తీరని లోటని, పార్టీలకతీతంగా రాములు కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి అంతా ముందుకు రావాలని 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీ – సయ్యద్ రజాలి కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని తూర్పు, పశ్చిమ కార్పొరేటర్లంతా రాములు కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు. ఎల్లుగంటి రాములు అస్వస్థతకు గురై మరణించడం బాధాకరమని, ఆయనను ఒక పార్టీ నాయకుడిగా భావించకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లంతా సోదర సమానుడిగా అనుకుని సాయం చేయాలన్నారు. కార్పొరేటర్లంతా ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పును అందజేస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందని, తోటి కార్పొరేటర్లంతా నా అభ్యర్థతను మన్నించి ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు విజయశ్రీ- సయ్యద్ రజాలి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే రాములు కుటుంబాన్ని ఆదుకోవడానికి తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ, మేయర్ ల సాయం కూడా కోరుదామని, అందుకు అందరూ సహకరించాలని ప్రకటనలో కార్పొరేటర్ కోరారు.
Recent Comments