- మరో నాలుగేళ్లు అంతే…
* 2026 వరకు నియోజకవర్గాల పెంపు ప్రసక్తే లేదు..
* స్పష్టం చేసిన కేంద్రం..
* గులాబీ నాయకుల్లో గుబులు..
* అసెంబ్లీ బరిపై ఆశలు పెంచుకున్న వారికి నిరాశే..కారుకు కష్టకాలం వచ్చింది. వలస నేతలో ఫుల్ అయిన కారుకు ఎన్నికల వేళా గడ్డుకాలం ఎదురుకానుంది. సమయానికి సీట్లు సర్దుబాటు చేయొచ్చు.., నియోజకవర్గాలు ఎలాగూ పెరిగే అవకాశాలున్నాయి కాదా.. అనుకున్న నాయకులకు నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. నాలుగేళ్ల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. 119 నుంచి సుమారు 153 స్థానాలకు పెరిగితే ఆశావహులు, వలసవాదులందరినీ మెప్పించొచ్చు అనుకున్న అధిష్టానానికి కేంద్రం ప్రకటనతో ఆశానిపాతమే ఎదురైంది. కారెక్కించుకున్న వారిని ఎలా కాకాపట్టాలి.., బుజ్జగిస్తూ ఎలా కాలం నెట్టుకురావాలనే మదనంలో గులబీ బాస్ పడినట్టు తెలుస్తోంది. మొత్తంగా బుధవారం నాటి కేంద్ర సర్కార్ పార్లమెంట్ సాక్షిగా విడుదల చేసిన ప్రకటనతో అంతా ఆయోమయంలో పడ్డారు. ఏం చేద్దాం.. ఎటు వెళ్దాం అనే దీర్ఘాలోచన చేస్తున్నారు.
-స్పాట్ వాయిస్, ఓరుగల్లు
కుండబద్ధలు కొట్టినట్టు..
అసెంబ్లీ సీట్లు పెంచేది లేదు., ఆ దిశగా ప్రయత్నించేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మాటకొస్తే మరో నాలుగేళ్ల అంటే 2026 వరకు ఆ ఊసే తీయొద్దన్నట్టుగా చెప్పింది. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరితే రూల్స్ అంగీకరించవని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొదటి జన గణనను ప్రచురించిన తర్వాతే అసెంబ్లీ నియోజకవర్గాల విభజన ఉంటుందని తెలిపింది. అప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజనలో ఎలాంటి మార్పులు ఉండవని, సీట్లు మార్పులు, చేర్పులపై ఏం చేసినా నిబంధనల మేరకే జరుగుతుంది తప్ప, నిబంధనలు మీరి జరపడానికి ఏమీ ఉండదని బుధవారం కేంద్రం సర్కార్ పార్లమెంట్ సమావేశాల్లో కుండబద్ధలు కొట్టినట్టు ప్రకటించింది.
మంత్రి సమాధానం..
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని, అప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని తెలిపింది. పార్లమెంట్‌లో ఏపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.
రాజ్యాంగ ప్రకారం…
పోయినేడాది కూడా కేంద్రం పార్లమెంట్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, సీట్లు పెంచే ఆలోచన లేదని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాతే అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని చెప్పింది. కాగా, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎలాంటి పక్షపాతం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరుగనున్నాయి.
Recent Comments