బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుండాల మదన్ కుమార్
బీఎస్పీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విముక్తి ప్రతిజ్ఞ దివస్’
స్పాట్ వాయిస్, నర్సంపేట: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆధిపత్య పార్టీల కుట్రలకు బలికావొద్దని బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుండాల మదన్ కుమార్ అన్నారు. నర్సంపేట పట్టణంలో ఆదివారం బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బుర్రి సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ విముక్తి ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా తో పాటు, బహుజన సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జిల్లా నాయకుడు గజ్జి దయాకర్ పార్టీ కార్యకర్తల చేత తెలంగాణ విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ కార్యనిర్వాహక ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుండాల మదన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో మరోసారి బహుజనులను మోసం చేసి, మాయ చేసి గెలవాలనే కుట్రలు ఆధిపత్య దోపిడీ పార్టీలు చేస్తున్నాయన్నారు. అందుకోసం తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీని కేంద్రంగా చేసుకొని అన్ని రాజకీయ ఆధిపత్య పార్టీలు కార్యాచరణ ప్రకటించాయన్నారు. సెప్టెంబర్ 17ను విమోచనం, విలీనం, విద్రోహం, సమైక్యతా దినం అని ప్రకటించి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాబట్టి బహుజన వర్గాలకు చెందిన పేద ప్రజలు ఎవ్వరూ కూడా ఆధిపత్య పార్టీల కుట్రలకు బలికావద్దని బహుజన్ సమాజ్ పార్టీ అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల ఇన్చార్జి తనుగుల శ్రీకాంత్, బస్కే అశోక్, చెన్నారావుపేట మండల ఇంచార్జ్ ఒంటరి రాములు, జన్ను అశోక్, ఓరుగంటి పవన్, సాయి, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Recent Comments