Thursday, November 21, 2024
Homeటాప్ స్టోరీస్బాగా సెలవిచ్చావయా మహేశా....

బాగా సెలవిచ్చావయా మహేశా….

బలైన కాంగ్రెస్ పరకాల కార్యకర్తలు..

అత్యుత్సాహంతో కొట్లాడమా..?
కొండా వర్సెస్ రేవూరి మధ్యలో నలిగిన శ్రేణులు
నాయకుడి కోసం కలెబడితే మిగిలిందిదా..?
బాగా సెలవిచ్చావయా మహేశా….
టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మదనపడుతున్న లీడర్లు

ఆహా… ఏమి సెలవిచ్చారు. మీరుమీరు ఒక్కటేనా.. మధ్యలో మేం బక్రాలమా..? మంచిగానే బుద్ధి చెప్పారు. ఆవులావులు కొట్లాడుకుంటే లేగల కాళ్లు విరిగినట్టే ఉంది మీ కథ. మీరేమో మంచోళ్లు., మేమేమో హౌ….. గాళ్లమా..? ఎలా కనిపిస్తున్నాం. మీకుమీకు మధ్యల ఉన్నదంతా పోయిందిగానీ, మేం చేసిందే మీకు ఇట్ల కనిపిస్తున్నదా..? సరిపోయింది. ఇప్పటికైనా కళ్లు తెరిపించారు. అది సరే మరీ ఆ మధ్య ఫోన్లో వాళ్లిద్దరు మాట్లాడుకున్నది ఏమంటారు. ఎంతైనా పెద్దోళ్లంతా ఒక్కటే, కిందున్నోళ్లే తేడా అని బహుబాగా సెలవిచ్చారు. ఒకే.. అటు సురేఖం.., ఇటు ప్రకారం… ఇద్దరి నడుమ మేం మేకలం.. ఎంత మంచి ముచ్చట చెప్పారండి మహేశు గారు……

స్పాట్ వాయిస్, హన్మకొండ :

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ఉంది కాంగ్రెస్ పెద్దల తీరు. వరంగల్ జిల్లాలో తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర అధ్యక్షుడి మాటలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. కేవలం కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన మాటలతో తమ నేత అస్తిత్వం కోసం కొట్లాడిన శ్రేణులు బలయ్యారనే విషయం చెప్పకనే తెలుస్తోంది. ఎద్దుల పొట్లాటలో లేగదూడ కాళ్లు విరిగిన చందంగా వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి మారింది.

నలిగిపోయారా..?
మంత్రి-ఎమ్మెల్యే ఆధిపత్య పోరులో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు నలిగిపోయారనే ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ మాటలు శ్రేణులను బాధించాయనే చర్చ సాగుతోంది. పార్టీ కోసం, తమ నాయకుడి కోసం కొట్లాడితే ఇలా తమపైనే నిందలు వేయడం సరికాదనే మాటలు వైరల్ అవుతున్నాయి. వివాదంపై ఇరువర్గాలతో మాట్లాడాలని సూచిస్తూనే శ్రేణులను తప్పుబట్టడంపై తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. తమ నేత కోసం కొట్లాడితే పార్టీ ఇచ్చిన గౌరవం బాగుందంటూ సెటర్లు వేస్తున్నట్లు వినికిడి.

శ్రేణుల్లో నిరుత్సాహం..
ఏ రాజకీయ పార్టీకైనా శ్రేణులే పట్టుగొమ్మలు. శ్రేణులు లేకుండా, వారు శ్రమించకుండా ఎవరూ లీడర్ కాలేరు. పార్టీ అధికారంలోకి రాదు. అలాంటి శ్రేణులు తప్పు చేస్తే.. పార్టీ లైన్ లో సరి చేసుకోవాలే కాని.. ఇలా అత్యుత్సాహమంటూ బహిరంగంగా విమర్శించడం సరికాదని, ఇది ఒకరకంగా కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి నుంచి పరకాల నియోజకవర్గంలో కొండా వర్సెస్ రేవూరి అన్నట్లుగానే సాగుతోంది. ఈ విషయం అధిష్టానం వరకు తెలిసినా.. సమస్య పరిష్కరించకుండా.. ఇలా రోడ్డున పడిన తర్వాత పార్టీకి చెడ్డపేరు రాకుండా.. పార్టీ కోసం, నాయకుడి కోసం శ్రమించే వారిని కించపరిచనట్లు మాట్లాడడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. ఈ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య వివాదం, కార్యకర్తల అత్యుత్సాహం.. ఇష్యూను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments