Saturday, November 23, 2024
Homeరాజకీయంజంగా వర్సెస్ నాయిని

జంగా వర్సెస్ నాయిని

రోడ్డున పడిన పశ్చిమ కాంగ్రెస్ లొల్లి
నేడు రేవంత్ రెడ్డి పాదయాత్ర
పోటాపోటీగా నాయిని, జంగా ఫ్లెక్సీలు..
జంగాకు పశ్చిమ నేతల సపోర్ట్..!
అసహనం వ్యక్తం చేస్తున్న నాయిని వర్గీయులు
స్పాట్ వాయిస్, హన్మకొండ: పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ నివురుగప్పిన నిప్పులా ఉంది. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా వర్గ పోరు రోడ్డునపడింది. సోమవారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. అలాగే కార్నర్ మీటింగ్‌ల్లోనూ మాట్లాడనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి రాక సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే వర్గపోరు కనిపించింది.

జంగా వర్సెస్ నాయిని..
హన్మకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈయన ఎప్పటి నుంచో పశ్చిమ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని సైతం బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పశ్చిమపై మరో నేత సైతం కన్నేశాడు. ఆయనే జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి. గతంలో ఈయన బహిరంగ ప్రకటనలు చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా రేవంత్ రాక సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డికి పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. నాయిని ఫ్లెక్సీలు ఉన్న చోటల్లా.. జంగా రాఘవరెడ్డి ఫ్లెక్సీ సైతం దర్శనమిస్తున్నాయి. జంగా ఒక అడుగు ముందుకేసి భారీ కటౌట్లు సైతం పలు చౌరస్తాల్లో ఏర్పాటు చేసి పశ్చిమలో తానే అన్నంతగా ప్రచారం చేసుకుంటున్నాడు.

రోడ్డున పడిన వివాదం..
రేవంత్ పాదయాత్ర సందర్భంగా పశ్చిమ కాంగ్రెస్ లో వివాదం రోడ్డునపడింది. జంగా రాఘవరెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడు ఆయన పాదయాత్ర అక్కడుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి కానీ.. పశ్చిమలో జరిగే పాదయాత్రలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై నాయిని వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పై అభిమానం, రేవంత్ పై ప్రేమతో ఏర్పాటు చేస్తే.. మరీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జ్ నాయిని ఫొటోను సైతం అందులో పెట్టాల్సి ఉండే. కానీ అవేమీ లేకుండా జంగా, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి.
పశ్చిమ నేతలు సైతం..
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఫ్లెక్సీలును పశ్చిమ కాంగ్రెస్ నేతలే ఏర్పాటు చేయడం, అందులో నాయిని ఫొటో లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పశ్చిమ నియోజకవర్గ నేతలు జంగా ఫ్లె్క్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నది. ఇక్కడ పోటీ చేస్తానన్న నాయకుడికి కొంతమంది స్థానిక నేతలు సపోర్ట్ లేదనే విషయం నేడు తేటతెల్లమైంది. జంగానే మా నాయకుడన్న తీరులో పశ్చిమలోని ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ లొల్లుతో పలుచనైపోయింది. ఇక ఇప్పుడు పశ్చిమలో జరిగిన ఫ్లెక్సీల లొల్లి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments