బీజేపీ ప్రభుత్వం ఒక్కో సంస్థలను వదిలించుకుంటోంది..
ప్రైవేటీకరణే ధ్యేయంగా మోదీ ముందుకెళ్తున్నారు..
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి
కలెక్టర్ కార్యాలయం ముట్టడి..
స్పాట్ వాయిస్, కలెక్టరేట్: ప్రభుత్వరంగ సంస్థల్ని వదిలించుకోవాలని ప్రయత్నించడం, ఒక్కో సంస్థను నాశనం చేసే యత్నాలు చేయడం దేశభక్తి ఎలా అవుతుందో బీజేపీ నేతలే చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక, దేశ విధ్వంసకర విధానాలను నిరసిస్తూ జాతీయ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు మంగళవారం హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… మూడేళ్లుగా రూ.2,10,000 కోట్లు (2020–21), రూ.1,75,000 కోట్లు (2021–22), రూ.65,000 కోట్లు (2022–23) మేరకు ప్రభుత్వ వాటాలను అమ్మేయాలనే లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్‌లోనే ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. ప్రైవేట్ టెలీకం కంపెనీలను ప్రోత్సహించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీసి, వేలాది ఉద్యోగులు వీఆర్‌ఎస్‌పై వెళ్లేలా చేశారని, 4జీ కేటాయించకుండా ప్రజలకు దూరమయ్యేలా చేశారని దుయ్యబట్టారు. 2017 నుంచి కనీసంగా వేతన సవరణ కూడా అమలు కావడం లేదన్నారు. సంబంధంలేని సేవలను కట్టబెట్టడం, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో పోస్టల్ ఉద్యోగులపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా పెరిగాయని పేర్కొన్నారు. నూతన పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అత్యధిక స్థాయికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ లుగా మార్చి హక్కులను హరిస్తోందన్నారు. కోట్లాది అసంఘటితరంగ కార్మికులు, ప్రభుత్వరంగ ఉద్యోగులు సంస్థల పరిరక్షణ, జీవన భద్రత, కనీస వేతనాలు వంటి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, తెలంగాణా ఉత్తర జిల్లాల కోఆర్డి నేటర్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు కొత్తపల్లి శ్రీనివాస్, మహమ్మద్ ఆయుబ్ మీసాల ప్రకాష్, జిల్లా ఏఐపీసీ చైర్మన్ డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా ఎస్సీ డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఓబీసీ డిపార్టుమెంటు చైర్మన్లు మడిపల్లి కృష్ణ గౌడ్, బొమ్మతి విక్రం, జిల్లా ఐఎన్టీయూసీ చైర్మన్ కూర వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తీక్, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, గ్రేటర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కత్తుల కవిత, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, హన్మకొండ మండల ఎస్సీడిపార్టుమెంటు అధ్యక్షురాలు తాళ్ళపల్లి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, ఓరుగంటి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments