Wednesday, November 13, 2024
Homeటాప్ స్టోరీస్ఇంటా బయట రచ్చ

ఇంటా బయట రచ్చ

ఏడాదిలోపే హస్తంలో లొల్లులు
రెండుగా చీలిన మానుకోట కాంగ్రెస్..?
చిచ్చుపెట్టిన ఇందిరమ్మ కమిటీలు
లొల్లుకు కేంద్రంగా మారిన ఉమ్మడి వరంగల్
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: కాంగ్రెస్ అబాసుపాలవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే ఇంటా బయట రచ్చ మొదలైంది. ఇటీవల వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకోగా.. ఆ లొల్లి మంత్రి, ఎమ్మెల్యేల మధ్య మంటలు పుట్టించింది. ఢిల్లీకి ఫిర్యాదు చేసేలా చేసింది. ఇక ఇన్నాళ్లు లోపాయి కారికంగా ఉన్న మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు తాజాగా ఇందిరమ్మ కమిటీల రూపంలో ఒక్కసారిగా బయటపడ్డాయి. ఏకంగా గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ను టార్గెట్ చేస్తూ నెల్లికుదురు మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పర్యటనకు అడ్డు తగలడంతో పాటు, ప్రెస్ మీట్ నిర్వహించి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం ప్రస్తుత ఎంపీ పొరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరి క్షణం వరకు టికెట్ ఈ ఇద్దరి నేతల్లో నీకా నాకా అన్న తరహాలో పోటీ సాగింది. చివరకు సర్వేలు, గతంలో ఒకసారి టికెట్ కోసం ఆశించి భంగపడటం లాంటి అంశాలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆశీస్సులు మురళి నాయక్ కు ఉండడంతో అధిష్టానం చివరి క్షణంలో మురళి నాయక్ కు టికెట్ ఇచ్చింది. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రమేయం లేకుండానే మానుకోట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులను ఉన్నఫలంగా తొలగించి బలరాం నాయక్ అనుచరులను నియమించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పటినుంచే ఇద్దరు నేతల అనుచరులు ఎవరికి వారుగా తమ నేతలకు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. టికెట్ దక్కించుకున్న మురళి నాయక్ ఎన్నికల్లో 50 వేల రికార్డు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ బలరాం నాయక్ ఎంపీ టికెట్ సాధించి ఆయన కూడా అఖండ విజయం సాధించారు. అయితే మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరు నేతల అనుచరులు పైపైకి కలిసి ఉన్నట్లు కనిపించినా లోలోపల ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎవరికి వారు పై ‘చేయి’ సాధించడానికి గత కొంతకాలంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రతిపాదించగా, చివరి క్షణంలో ఎంపీ బలరాం నాయక్ ప్రతిపాదించిన గంట సంజీవరెడ్డికి ఇప్పించడంతో ఎమ్మెల్యే పై ఎంపీ వర్గం పై చేయి సాధించినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మురళి నాయక్ జన్మదిన వేడుకల సందర్భంగా కేసముద్రం మండల కేంద్రంలో అటు ఎమ్మెల్యే అనుచరుడిగా పేరున్న డీసీసీ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, బలరాం నాయక్ అనుచరుడిగా గుర్తింపు ఉన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు వేర్వేరుగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అంబటి మహేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని అల్లం నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనకుండానే వేదిక పక్క నుంచి గూడూరుకు వెళ్లడంతో అల్లం అనుచరులు ఎమ్మెల్యే పై గుస్సా వ్యక్తం చేశారు. ఇలా కొంతకాలంగా మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో చాప కింద నీరులా ఉన్న వర్గ విభేదాలు బహిర్గతం కావడంతో పాటు గురువారం నెల్లికుదురు కాంగ్రెస్ నేతలు పార్టీ కోసం కట్టించే వారికి కమిటీలో చోటు కనిపించకుండా, ఎమ్మెల్యే అనుచరులకి పెద్దపీట వేశారని ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేసి విమర్శలకు దిగడం, శుక్రవారం ఎమ్మెల్యే వర్గీయులు పోటీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలకు దిగడంతో కాంగ్రెస్ పార్టీ మానుకోట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మాటున వర్గ పోరు మరింత రాజుకున్నట్టయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్, శాయంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాదిరిగా మహబూబాబాద్ నియోజకవర్గంలో గ్రూపు విభేదాలు పొడసూపడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments