Monday, April 14, 2025
Homeటాప్ స్టోరీస్ఇండ్ల పేరుతో దందా చేస్తే కేసులే..

ఇండ్ల పేరుతో దందా చేస్తే కేసులే..

ఇండ్ల పేరుతో దందా చేస్తే కేసులే..

 నిరుపేద‌లకే అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి

 ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక

ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి

స్పాట్ వాయిస్, హైద‌రాబాద్‌: అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. గ్రామ స్థాయిలో ల‌బ్ధిదారుల ఎంపిక‌లో ఇందిర‌మ్మ క‌మిటీలు జాగ్ర‌త్త వ‌హించాల‌ని.. అర్హుల‌నే ఎంపిక చేయాల‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ క‌మిటీ త‌యారు చేసిన జాబితాను మండ‌ల అధికారుల‌తో కూడిన (త‌హ‌సీల్దార్‌, ఎంపీడీవో, ఇంజినీర్‌) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి త‌నిఖీ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవ‌రైనా అన‌ర్హుల‌కు ఇల్లు ద‌క్కిన‌ట్ల‌యితే త‌క్ష‌ణ‌మే దానిని ఇందిర‌మ్మ క‌మిటీకి తెలియ‌జేసి ఆ స్థానంలో మ‌రో అర్హునికి ఇల్లు మంజూరు చేయాల‌న్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల పేరుతో ఎవ‌రైనా దందాలు చేస్తున్న‌ట్లు తెలిస్తే వెంట‌నే కేసులు న‌మోదు చేయాల‌న్నారు. అన‌ర్హులు ఎవ‌రైనా ఇల్లు ద‌క్కించుకొని నిర్మించుకుంటే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం పాటు వారు పొందిన మొత్తాన్ని వ‌సూలు చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇంటి ల‌బ్ధిదారుకు మంజూరైన ఇంటికి అత‌ని సౌల‌భ్యం ఆధారంగా అద‌నంగా 50 శాతం మేర నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సీఎం అన్నారు. ల‌బ్ధిదారుకు ఆర్థిక‌ప‌ర‌మైన ఊర‌ట ల‌భించేందుకుగానూ సిమెంట్‌, స్టీల్ త‌క్కువ ధ‌ర‌ల‌కు అందేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ‌నిర్మాణ‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్ర‌ట‌రీ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, గృహ నిర్మాణ‌ శాఖ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ద‌ప్ర‌కాష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments